వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కమలనాథుల కు దగ్గరవ్వాలని హిందువులపై ఎన్నడూ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ హిందూ మతం గొప్పతనం గురించి లెక్చర్లు దంచేస్తున్నారు. తాజాగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మళ్లీ అదే ప్రయత్నం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వాపోయారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం జరిగి ఏడాదవుతున్నా నిందితులను ఎందుకు పట్టుకోలేదని అన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ ఏమైందని నిలదీశారు.
ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దేవాలయాల భద్రత, అభివృద్ధిపై శ్రద్ద లేకపోవటం సిగ్గుచేటన్నారు. జగన్ తన స్వార్థం కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటమే తప్ప మత సామరస్యాన్ని ఎలా కాపాడాలో ఆయనకు తెలియదని కళా వెంకట్రావు ఆరోపించారు.
నిందితులను పట్టుకోకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టా?
రాముడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోకపోతే సీఎం జగన్మోహన్రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు ఎలా అవుతుందని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేస్తుంటే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? అని అడుగుతున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయన శిలాఫలకాన్ని ఎత్తి పారేయడం, అక్కడ రాజకీయం చేయడం కళా వెంకట్రావుకు కనిపించలేదా? అని అంటున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు సందర్భాల్లో కాళ్లకు బూట్లు ధరించే పూజాధికాలు నిర్వహించినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో 43 దేవాలయాలను కూల్చేసి, విగ్రహాలను ప్రొక్లెయినర్లతో తొలగించినప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి? 2015 గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలు బలిగొన్నప్పుడు హిందువుల మనోభావాలు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పటి వరకు ఆ కేసులో నిందితులను పట్టుకోలేనంతగా కేసును ఎవరు నీరుగార్చారు? సీఎం జగన్మోహన్రెడ్డి హిందూమతం పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్న కళా.. అందుకు ఒక్క ఉదాహరణ అయినా చూపగలరా? అంతర్వేదిలో ఏడాది తిరగకుండానే రూ.కోటి రూపాయల వ్యయంతో రథాన్ని తయారు చేసి ఉత్సవాలకు సిద్ధం చేసిన సంగతి కళాకు తెలియదా?
సీబీఐనే అడగొచ్చు కదా..
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ ఏమైందంటున్న కళా.. ఈ ప్రశ్నను సీబీఐనే అడిగితే బావుంటుంది. సీనియర్ రాజకీయవేత్త అయిన కళాకు సీబీఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమి ఉండదని తెలిసినా జగన్మోహన్రెడ్డిని ప్రశ్నించడం అంటే బురదజల్లడం కాక మరేమిటి? ఏడాది క్రితం ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడుల కేసుల్లో మెజార్టీ నిందితులు తెలుగుదేశం పార్టీ వారో, దాని సానూభూతిపరులో ఉన్నారు. ఈ విషయం ప్రెస్మీట్ పెట్టి మరీ పోలీసు అధికారులు వివరించారు.
అన్ని కేసుల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. కొన్నిచోట్ల అరెస్టులు జరిగాయి. పలువురు టీడీపీ నేతలు రిమాండ్కు కూడా వెళ్లారు. ఇవన్నీ తెలిసి కూడా ఏమీ ఎరగనట్టు ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం జనాన్ని తప్పుదోవ పట్టించాలనేనా? సున్నితమైన మత అంశాన్ని మళ్లీ తెరపైకి తేవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని, అయితే జనం ఆ పార్టీని నమ్మరని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. హిందువులపై హఠాత్తుగా ప్రేమను ఒలకబోసినంత మాత్రాన బీజేపీ వారు టీడీపీని దగ్గరకు చేర్చుకోరని, ఆ పార్టీ అగ్రనాయకత్వానికి చంద్రబాబు నిజస్వరూపం తెలిసిపోయిందని అంటున్నారు. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కనీసం అపాయింట్మెంట్ కూడా చంద్రబాబుకు ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.