ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్, జెడ్పీ, పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కింది. చివరకు కుప్పం నగర పంచాయతీ సహా అన్నిచోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. నెల్లూరు కార్పోరేషన్ లో క్లీన్ స్వీప్ చేసి 54కి 54 డివిజన్లు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. కానీ కొండపల్లి నగర పంచాయతీ మాత్రం ఆసక్తిగా మారింది. కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఈ నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీలకు సమానంగా చెరో 14 వార్డులు దక్కాయి. 10వ వార్డు ఇండిపెండెంట్ దక్కించుకోగా, ఆమె మాత్రం టీడీపీకి మద్ధతు పలుకుతున్నట్టు ప్రకటించారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన పురపాలక సంస్థల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. అందరి దృష్టి కొండపల్లిపై ఉంది. చివరకు ఏం జరుగుతోందోననే చర్చ సాగుతోంది. ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దానికి ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ నగర పాలకసంస్థలో ఎక్స్ అఫీషియోగా ఆప్షన్ తీసుకున్న ఎంపీ కేశినేని నాని ఇప్పుడు కొండపల్లిలో కూడా ఆప్షన్ ఇచ్చారు. విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఇటు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎంపీ ఓటుతో కొండపల్లిని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుగానే ఈప్రయత్నాలు ప్రారంభించినట్టు పలువురు భావిస్తున్నారు. దానికి కోర్టు కూడా అనుమతించింది. కానీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ విచారణ కోరినప్పటికీ అత్యవసరం కాదని చెబుతూ సీజే దానికి అంగీకరించలేదు. ఓటింగ్ నిర్వహించి, ఫలితాల వెల్లడి మాత్రం నిలిపివేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.
ఎక్స్ ఆఫీషియో ఓట్లతో కలిపి 31 మందికి ఓటు ఉండే అవకాశం ఉంది. చివరి నిమిషంలో కేశినేని నాని విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఓటు అనుమతిస్తే మ్యాజిక్ ఫిగర్ 16. అప్పుడు టీడీపీకి బొటాబొటీగా సరిపోతుంది. కానీ ఒక్క కౌన్సిలర్ తేడా చేసినా టీడీపీ ఆశలు గల్లంతవుతాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు పూర్తికాగానే కుటుంబ సభ్యులతో సహా కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. ఆదివారం రాత్రి వారిని గొల్లపల్లి తీసుకొచ్చారు. సోమవారం ఉదయమే వారిని మునిసిపల్ ఆఫీసుకు తరలించే అవకాశం ఉంది. దాంతో ఈ సమయంలో టీడీపీ కౌన్సిలర్ల వ్యవహారశైలి మీద ఆపార్టీ నేతలే గట్టి నిఘా పెట్టారు. విప్ కూడా జారీ చేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక జరగబోతోంది. దాంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం.
అదే సమయంలో ఓటింగ్ కి సరిపడా కోరం లేకపోతే సమావేశం వాయిదా వేస్తామని మునిసిపల్ కమిషనర్ ప్రకటించారు. దాంతో కొండపల్లి రాజకీయాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఎవరి ఎత్తులు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశం అవుతుంది. మరో పది రోజులు గడిస్తే వైఎస్సార్సీపీకి చెందిన తలశిల రఘరామ్ కి కూడా ఎమ్మెల్సీ కోటాలో ఎక్స్ ఆఫీషియో ఓటు వస్తుంది. ఆయనకు కూడా అవకాశం వస్తే అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈలోగా కొండపల్లి కథ తేలుతుందా లేక సాగుతుందా అనేదే పెద్ద ప్రశ్నగా ఉంది.
Also Read : Kondapalli Municipality – కొండపల్లి కుర్చీ ఎవరికీ, కీలకంగా మారిన ఎక్స్ ఆఫీషియో ఓట్లు