తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేయడానికి ఏ అంశాన్ని వదులుకోవడం లేదు. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే జగన్ సర్కార్ లో చలనం లేదంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి కంటే కక్షసాధింపు చర్యలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా మారిపోవడం బాధాకరమన్నారు. కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడంతోనే జగన్‌కు ప్రజల ప్రాణాలంటే ఎంత చులకనో తెలిసిందన్నారు. రోజువారీ కరోనా కేసుల్లో 5వ స్థానంలో వ్యాక్సినేషన్లో 10వ స్థానంలో ఏపీ ఉందంటే అందుకు ప్రభుత్వ బాధ్యతారహిత్యమే కారణమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా అని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు.
ఏ మాత్రం విలువలేని ఆరోపణలు
నిర్లక్ష్యంతో కరోనా మొదటి, రెండో దశల్లో భారీ ప్రాణనష్టానికి కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గత అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటంటూ అచ్చెన్న అవాస్తవాలు మాట్లాడడం శోచనీయం. కోవిడ్ నియంత్రణలో, వ్యాక్సినేషన్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రశంసలు అందుకున్న సంగతి అచ్చెన్నకు తెలియదా? సచివాలయ, వలంటరీ వ్యవస్థ ద్వారా కేసులను ట్రేస్ అవుట్ చేసి, క్వారంటైన్‌కు తరలించడంలో కాని, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి తగిన సేవలు అందించడంలో గాని ఏపీ ప్రభుత్వం పనితీరుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అభినందనలు లభించాయి.
ఒకే రోజు 6.50 లక్షల మందికి వ్యాక్సినేషన్‌తో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. కేంద్రం సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ అత్యంత వేగంగా వినియోగిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఉన్న రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు ఉంది. వ్యాక్సినేషన్లో దేశంలో ఎన్నో స్థానం అన్నది కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో రాష్ట్రం చేతిలో ఏమీ ఉండదన్న సంగతి తెలియనట్టు నటించడం అచ్చెన్నకే చెల్లింది. కరోనాను అరికట్టడానికి బాధ్యతగల ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాలి గాని కేవలం ప్రభుత్వంపై బురదజల్లడానికి కరోనాను కూడా వాడేసుకుందామనుకోవడం టీడీపీ భావదారిద్య్రానికి నిదర్శనం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వైద్య రంగానికి పెద్ద పీట
కరోనా నివారణ, వైద్య రంగానికి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని అచ్చెన్న అనడం టీడీపీ ఉనికి కోసం చేస్తున్న ప్రకటనలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 104, 108 వాహనాలకు మళ్లీ జీవం పోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచింది. రాష్ట్రంలో 90 శాతం మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోనే కాక చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా ఆరోగ్య శ్రీ వర్తించేలా చర్యలు తీసుకుంది. ఖాళీగా ఉన్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. పీహెచ్సీ, సీహెచ్‌సీలను పటిష్టం చేసింది.
ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి నిరుపేదలకు హెల్త్ చెకప్‌లు చేయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ పిల్లలకు, వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు, కళ్లజోళ్లు ఉచితంగా అందించింది. పేదలకు సకాలంలో వైద్యం అందించడానికి బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనకాడడం లేదు. రెండున్నరేళ్ల లో వైద్యరంగంలో ప్రభుత్వం ఇన్ని విప్లవాత్మక చర్యలు తీసుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే జనం నమ్ముతారా అచ్చెన్నా?