ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలుగా పేరొందిన ఎన్నో నియోజకవర్గాలు.. వైఎస్సార్సీపీ ధాటికి కుప్పకూలిపోయాయి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కోలుకోలేని దుస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. ఇక టీడీపీకి మొదటి నుంచీ అచ్చిరాని నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ ధీనంగా ఉంది. అటువంటి వాటిలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఒకటి. స్థిరమైన నాయకత్వం లేక.. ఉన్న నాయకులు వర్గపోరులో తలమునకలుగా ఉండటంతో నియోజకవర్గంలో పార్టీకి దిశ, దశ లేకుండా పోయింది. ఉన్న నాయకులు ఆధిపత్య పోరులో తలమునకలుగా ఉండగా.. కార్యకర్తలు చెదిరిపోతున్నారు.మరోవైపు ఇంఛార్జి పదవి తీసుకునేందుకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు.
తరచూ మార్పులు.. క్యాడర్ లో గందరగోళం
ఆత్మకూరు నియోజకవర్గం మొదటి నుంచీ టీడీపీకి కొరకరాని కొయ్యలాగే ఉంది. 1983లో టీడీపీ ఏర్పాటైన తర్వాత ఆ ఎన్నికలతోపాటు 1994లో మాత్రమే అక్కడ గెలుపొందింది. 2004 స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు .2009 వరకు కాంగ్రెస్.. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అక్కడ పాగా వేశాయి. 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఆత్మకూరులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి గుటూరు మురళీ కన్నబాబు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనే ఇంఛార్జిగా కొనసాగారు. కానీ 2018లో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడంతో కన్నబాబును తప్పించి ఆనంకు బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులకే ఆయన వైఎస్సార్సీపీలోకి వెళ్లిపోవడంతో తిరిగి కన్నబాబును ఇంఛార్జిగా నియమించారు.
అయితే 2019 ఎన్నికల్లో ఆయన్ను కాదని కృష్ణమనాయుడుకు టికెట్ ఇచ్చారు. ఆయన కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే సుందర రామిరెడ్డి తనయుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని పార్టీ తాత్కాలిక ఇంఛార్జిగా నియమించారు. ఇలా తరచూ ఇంఛార్జీలను మార్చడంతో పార్టీపై ఎవరికీ పట్టులేకుండా పోయింది. కార్యకర్తలకు దిశానిర్దేశం లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది.
నేతల మధ్య వర్గపోరు
నియోజకవర్గంలో ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. వీరి మధ్య పార్టీ విడిపోయింది. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఒక సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే.. మురళీకన్నబాబు, లక్ష్మయ్య నాయుడు మరో సామాజికవర్గానికి చెందినవారు. దాంతో పార్టీ క్యాడర్ కూడా వారికి అనుకూలంగా వర్గాలుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాలను కూడా విడివిడిగానే నిర్వహిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గానికి ఫుల్ టైం ఇంఛార్జీని నియమించేందుకు టీడీపీ అధిష్టానం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. గుటూరు, బొమ్మిరెడ్డి, కొమ్మిల్లో ఒకరిని ఇంఛార్జి చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంఛార్జి పదవి చేపట్టినా.. ఎన్నికల్లో టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ లేకపోవడంతో పదవి చేపట్టేందుకు వారెవరూ ముందుకు రావడంలేదు. మరోవైపు వీరిని కాకుండా పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగల సమర్ధుడైన నాయకుడిని ఇంఛార్జిగా నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Also Read : ప్రజలు గెలిపించారు – కుటుంబం ఓడించింది ..ఎన్టీఆర్