ఓటీఎస్ ను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సోమవారం నిర్వహించిన ఆందోళనలు, చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షంగా టీడీపీ దివాలాకోరుతనానికి అద్దం పట్టేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడలో చేసిన వ్యాఖ్యలు మరీ ఘోరంగా ఉన్నాయి. జగన్ పరిపాలన తుగ్లక్ చర్యలకు మించి సాగుతోందని ఆయన నోరు పారేసుకున్నారు. పన్నుల భారాలతో ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించారు. కేంద్రం సహకారంతో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఏమిటి? వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను డబ్బులు కట్టాలని కోరడం వింతగా ఉందంటూ ఆశ్చర్యపోయారు. పేదలను టార్గెట్ చేసుకుని రూ.కోట్లు దోచుకోవడం దుర్మార్గం. పథకాలను రద్దు చేస్తామని భయపెట్టి డబ్బులు కట్టించుకుంటున్నారు. ప్రజలు భయపడవద్దు… జగన్ ప్రభుత్వ దోపిడీని అందరం అడ్డుకుందాం అంటూ పసలేని విమర్శలు చేశారు.
పథకం ప్రకారం దుష్ప్రచారం
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఖండిస్తున్నా మళ్లీ పాత పాటనే పాడడం ద్వారా సర్కారుకు జనంలో చెడ్డ పేరు తేవాలనే టీడీపీ కుట్ర అర్థం అవుతోందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఓటీఎస్‌పై ఇప్పటికే పలుమార్లు విస్పష్టంగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పేదలకు తమ గృహంపై సంపూర్ణ హక్కు కల్పించడం ఈ పథకం ఉద్దేశమని, వారి ఆస్తిపై వారికి శాశ్వత హక్కు ఈ పథకం కల్పిస్తుందని చెప్పింది. ఇందుకోసం ఉచిత రిజిస్ట్రేషన్ సైతం చేసి హక్కు ధ్రువీకరణ పత్రాలను ఇస్తోంది.
ఇన్నాళ్లూ పేరుకే ఇంటి యజమానులు గాని దానిపై వారికి హక్కులు లేకపోవడంతో క్రయవిక్రయాలకు, తనఖాకు అవకాశం ఉండేది కాదు. ఓటీఎస్ వల్ల ప్రభుత్వం ఆ హక్కు కల్పిస్తోంది. దీన్ని వినియోగించుకుంటే పేదలకు ఎంతో మేలు. కానీ ఓటీఎస్ ద్వారా ప్రభుత్వం పేదలను దోచుకుంటోంది అనే దుష్ప్రచారాన్ని పచ్చబ్యాచ్ ఒక పథకం ప్రకారం చేస్తోంది అని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఓటీఎస్ పథకం పూర్తిగా స్వచ్ఛందం అయినప్పుడు దోచుకోవడం ఎలా అవుతుంది?
పథకంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే దాన్ని బలవంతం చేస్తున్నట్టు చిత్రీకరిస్తూ ఇన్నాళ్లూ ప్రచారం చేసిన టీడీపీ మళ్లీ దీనిపై ఆందోళనలకు దిగడం అంటే వారికి సర్కారును విమర్శించడానికి వేరే అంశాలు లేక దీన్నే పట్టుకు వేళ్లాడుతున్నారనుకోవాలా? ఇది దివాలాకోరుతనం కాక మరేమిటి అని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ ఎంతగా విష ప్రచారం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్‌కు జనం స్పందిస్తున్నారని, దాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ ఆందోళనలకు దిగిందని అంటున్నారు.
Also Read : స్కిల్ స్కాం.. గంటాకు బెయిల్
ఎన్నికల హామీలు నెరవేర్చలేదట!
సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిన విమర్శలు జనం నవ్వుకునేలా ఉన్నాయి. 95 శాతం హామీలను అమలు చేసి రోజు రోజుకి జనాదరణను పెంచుకుంటున్న ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా నమ్ముతారా? పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు జనంలో వైఎస్సార్ సీపీ సర్కారుకు ఉన్న ఇమేజీని పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి విమర్శలు చేస్తే టీడీపీకి విశ్వసనీయత ఉంటుందా? ఇప్పటికే హామీ ఇస్తే అమలు చేయరు అన్న స్థిరమైన అభిప్రాయం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉంది. దానికితోడు అధికార పక్షం హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నా అబ్బే చేయడం లేదు అంటే లబ్ధిదారులైన జనం వీరి మాటలు ఎలా నమ్ముతారు? ఆ మాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా టీడీపీ విమర్శలు, ఆందోళనలు చేస్తే ఎవరికి నష్టం?