తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మీద ఈగ వాలినా ఆఖరికి చీమ ఆయన వంక చూసినా అంతెత్తున సదరు ఈగ, చీమలపై విరుచుకునే వారంతా. అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు, లోకేష్నాయుడులు ఇచ్చిన ‘ఫ్రీ’ హేండ్ను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వారి కోసమే పూర్తిస్థాయిలో పనిచేసారు. అలా చేసిన పనుల్లో చట్ట వ్యతిరేకంగా కొన్ని ఉన్నప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా స్వామిభక్తిని చూపించుకున్నారు.
ఇదంతా అధికారంలో ఉన్న ఐదేళ్ళు అప్రతిహతంగా కొనసాగిపోయింది. తీరా ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారం పోయింది. అప్పుడుగానీ వాస్తవ పరిస్థితి తమ్ముళ్ళకు బోధపడలేదు. ఇన్నాళ్ళు పెదబాబు, చినబాబులను చూసుకుని జనానికి దూరమవుతూ తామెంత తప్పు చేసామో అధికారం పోయాకగానీ అర్ధం కాలేదు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకునన్నట్టయింది వారి పరిస్థితి.
ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుతో సీయం వైఎస్ జగన్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో నిస్సిగ్గుగా చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల చిట్టాను బైటకు తీసింది. ఈఎస్ఐ స్కామ్లో అచ్చెంనాయుడు, వాహనాల అక్రమ వ్యవహారంలో జేసీ ప్రభాకరరెడ్డిలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి మాత్రమే వారికి బెయిల్ మంజూరైంది.
ఈ నేపథ్యంలో వారితోపాటు, ఇతర తెలుగు తమ్ముళ్ళలో అంతర్మథనం జరుగుతోంది రాజకీయ వర్గాల టాక్. ఇదేంటిది అంతా పెదబాబు, చినబాబేనని నమ్మి పనిచేసినప్పటికీ కష్టకాలంలో వారి నుంచి తమకు వచ్చిన కనీస నైతిక మద్దతుగానీ, న్యాయ సహాయంగానీ, ఇతర ఏ తోడ్పాటుగానీ అందలేదేంటి అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా యాక్టివ్గా ఉన్న నాయకుల్లో జోరుగా చర్చసాగుతోందన్నది అభిజ్ఞవర్గాల భోగట్టా. అధికారం కోల్పోయినప్పటికీ అధికార పక్షంపై ఒక్క పెట్టున విరుచుకుపడిన ఆ నాయకులంతా ఇప్పుడు ఏ సంఘటనపైనా పెద్దగా స్పందించకపోవడానికిదే కారణం అదేనంటూ సదరు వర్గాలు విస్తృతంగానే ప్రచారం చేస్తున్నాయి.
పార్టీ అధినేతలు చెప్పిన ప్రతి పనినీ చేసామని, ఎవరిని తిట్టమంటే వారిని ఏ కారణం లేకుండానే తిట్టిపోసామని, అయినప్పటికీ తమకు ఇబ్బందులు ఎదురైనప్పుడు తమకు అన్ని విధాలా సహాయంగా ఉండాల్సినప్పటికీ తమ పార్టీ అధినేతలు పూర్తిస్థాయిలో పట్టించుకోలేదన్నది సదరు ‘సొంత నాయకుల’ బాధితుల అభిప్రాయంగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నాయకుల వ్యవహారంలోనూ ప్రారంభంలో చేసిన హడావిడి ఆ తరువాత టీడీపీ నాయకులు చేయకపోవడాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో ముందులో కాస్తంత ఫోకస్ పెట్టినప్పటికీ, ఆ తరువాత పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవన్నది వారి వాదన. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా చెలామణీ అయిన నాయకుల పట్లే చంద్రబాబు, లోకేష్ నాయుడుల స్పందన ఈ విధంగా ఉంటే మిగిలిన వారి సంగతేంటన్న అంతర్మథనం వారిలో ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు.
ఇంకొదరైతే పార్టీకి కంకణ బద్దులమై ఉంటామని, కానీ ఏరుదాటాక తెప్పతగలేసే అధినేతలు ఉంటే ఏం చేయాలని? బాహాటంగానే విమర్శిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నాయకుల పట్ల ఉన్నది ఉన్నట్లుగా వ్యవహరించకుండా, కులాలను వెలికి తీసి పబ్బం గడుపుకోవాలని చూసారని, ఇది క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయమే కాకుండా, సొంత పార్టీలోని కీలక నేతలు తమతమ పరిమితుల పట్ల పునరాలోచించుకునే పరిస్థితిని తెచ్చిందన్న వాదనొకటి బలంగా విన్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉనికి చాటుకోవడానికి నానా తంటాలు పడుతున్న టీడీపీ నాయకత్వానికి భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు సొంత పార్టీ నాయకుల నుంచే ఎదురయ్యేందుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.