పేదలకు వారి ఇళ్లపై అధికారాలను ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకంపై తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు. దాన్ని ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంపై తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు గ్రామస్థాయిలో పనిచేసే అధికారుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో 28 లక్షల మంది లబ్ధిదారులకిచ్చే ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఇలాగే కోర్టులకెక్కి ఆపించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేయడంతో పేదల సొంతింటికల త్వరలోనే నెరవేరబోతోంది. ప్రస్తుతం ఓటీఎస్‌ను అలాగే నిలిపివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని ఆపారు. ఇప్పుడు రుణసదుపాయం పొందిన వారికి వాళ్ల ఇళ్లపై సంపూర్ణ హక్కులను కూడా పొందనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వన్‌టైం సెటిల్మెంట్ పాత స్కీమే..
వన్ టైం సెటిల్మెంట్ స్కీం 24 జనవరి 2000లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం వడ్డీ మాఫీ మాత్రమే ఇచ్చేది. మార్చి 31, 2014 వరకు అంటే 14 ఏళ్లలో 2,31,284 మంంది ఈ స్కీంను వినియోగించుకున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ పథకం అమలు కాలేదు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వన్‌టైం సెటిల్మెంట్ స్కీంను పొడగించమని పదే, పదే కోరినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికే 14 సంవత్సరాలుగా అమల్లో ఉన్న స్కీంలో కనీసం వడ్డీ మాఫీ కూడా చేయలేదు. ఆ విధంగా పేదల సమస్యను ఐదేళ్ళూ టీడీపీ సర్కారు పక్కన పెట్టింది.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయన్ను కలిసిన ప్రజలు.. ఉన్న వన్‌టైం సెటిల్ మెంట్ స్కీంను కూడా నిలిపివేశారని ఆయన దగ్గర తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఓటీఎస్ పథకం కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా వైఎస్ జగన్ సంపూర్ణ గృహహక్కు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) చట్టం 1977 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆగస్టు 15, 2011 కంటే ముందు ఇచ్చిన నివేసిన పత్రాలు కానీ, డీఫామ్ పట్టాలు కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఈ పథకంలో లబ్ధిపొందుతారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో కూడా సవరణలు తీసుకువచ్చారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సుమారు 40 లక్షల మంది రుణం తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలుతో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్ణయించిన మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లించి ఈ పథకానికి అర్హులు కావచ్చు. నిర్ణయించిన మొత్తం కంటే కట్టవలసిన సొమ్ము ఎక్కువగా ఉంటే.. నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఉన్న మొత్తం పూర్తిగా మాఫీ అవుతుంది.
ఇవీ ప్రయోజనాలు
గతంలో అమలైన ఓటీఎస్ స్కీంలో నిర్ణయించిన మొత్తాన్ని కట్టిన వారికి, తాకట్టు పెట్టిన నివాసిత స్థలపత్రం కానీ, డీఫామ్ పట్టా కానీ తిరిగి ఇచ్చేవారు. ఏ విధమైన అమ్ముకునే హక్కు కానీ, వారసులుకు బహుమతిగా రిజిస్ట్రేషన్ చేసే హక్కు కానీ లభించేది కాదు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో లబ్ధిదారుడికి వాళ్ల ఇళ్లపై సర్వహక్కులు ఉంటాయి. అమ్ముకోవడానికి, బహుమతిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వమే వారి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి డిసెంబరు 21 తర్వాత సచివాలయంలోనే అందజేస్తారు.
గతంలో ఉన్న ఓటీఎస్ స్కీంలో నివేసిత పత్రం మీద కానీ, డీఫామ్ పట్టాల మీద గానీ బ్యాంకులు రుణసదుపాయం కల్పించేవి కావు. ఇప్పుటి ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద భూమి, ఇంటి విలువ మీద 75 శాతం వరకు కూడా బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు లబ్ధిదారుడికి ఇచ్చే సమయంలో యూజర్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మూడు మాఫీ చేస్తారు.. మాఫీ అయిన మొత్తం ఒక కార్పొరేషన్ పరిధిలో తీసుకుంటే సుమారు రూ.1లక్ష లబ్ధి చేకూరుతుంది. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం 13 జిల్లాల్లోనూ ఇప్పటికి 1 లక్షా 6 వేల మంది ఉపయోగించుకున్నారు. రోజూ దాదాపు 15 వేల మంది వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
టీడీపీ తీరు హాస్యాస్పదం
టీడీపీ ఈ మంచి పథకాన్ని అడ్డుకోవడానికి..తాము అధికారంలోకి వస్తే పూర్తిగా రుణం మాఫీ చేస్తామని, చెప్పడం హాస్యాస్పదం. టీడీపీ అధికారంలో ఉండగా రైతు రుణమాఫీ అని ఏ రకంగా రైతులను వంచించారో ఏ అన్నదాతను అడిగినా చెప్తారు. డ్వాక్రా రుణమాఫీ అని, బ్యాంకుల్లో బంగారం మీ ఇంటికొస్తుందని విడిపించకండని మహిళలను ఏ విధంగా మోసం చేశారో ఎవరిని అడిగినా చెప్తారు. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇఛ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని అడిగిన పాపానికి, చివరికి వెబ్సైట్ నుంచి పార్టీ మేనిఫెస్టోనే తొలగించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. ఈ సంగతులన్నీ ప్రజలు మరచిపోయారనుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక మంచి పథకంపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.