‘అధికారంలో లేనప్పుడే చంద్రబాబు సోది చెబుతారు.. అధికారంలోకి వచ్చాక అధికారుల మాటలే వింటారు’.. అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తమ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీవర్గాల్లో దీనిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. గతంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా.. ‘ఉప ఎన్నిక తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు’.. అని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అయ్యింది. అప్పుడాయన నాలుగు గదుల మధ్య ఆ వ్యాఖ్యలు చేశారు.
కానీ తాజా వ్యాఖ్యలను ఒక సమావేశంలో అందరి సమక్షంలోనే తన వ్యాఖ్యలతో చంద్రబాబు తత్వాన్ని విశదీకరించడం మరింత కలకలం రేవుతోంది. విశాఖలో టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ విద్యుత్ కార్మిక సంఘం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ సభలో అచ్చెన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో లేనప్పుడు మరోలా చంద్రబాబు వ్యవహరించే విధానాన్ని బట్టబయలు చేశారు.
అధికారంలో లేనప్పుడే అందరూ గుర్తుకొస్తారు
టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారంలో లేనప్పుడే అందరూ గుర్తుకొస్తారని.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ సోది చెబుతారని, తీరా అధికారంలోకి వచ్చాక అధికారుల మాటలే వింటారని అచ్చెన్నాయుడు ఓపెన్ గా చెప్పేశారు. పార్టీ ముఖ్యనేతల మాటలు కూడా ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామని అంగీకరించారు. కింది స్థాయిలో ఉన్నవారిని దగ్గరికి తీసుకోవడంలో తమ పార్టీ విఫలమైందన్నారు. ఉద్యోగులు, కార్మికులు టీడీపీతోనే ఉన్నారని అనుకున్నామని చెప్పారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు, పార్టీ ముఖ్యనేతలు ఎన్నో చెబుతారని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోరనే భావన కార్యకర్తలు, ప్రజల్లో బలంగా ఉందన్నారు.
పార్టీవర్గాల్లో కలవరం
అచ్చెన్న తాజా వ్యాఖ్యలు టీడీపీలో కలవరం రేపుతున్నాయి. అధినేత గురించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పార్టీకి చేటు చేస్తాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయాన్ని అచ్చెన్న చెప్పారని, ఆ వైఖరిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింత నష్టపోతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అసలు బండారం బయటపడింది.. ఈ విషయం ప్రజలకు తెలుసు కనుకే.. ఆయన ఇస్తున్న హామీలను, చేస్తున్న ప్రసంగాలను విశ్వసించడం లేదని సోషల్ మీడియా వేదికగా అనేకమంది వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : చంద్రబాబు గాలి తీసేసిన సోము..