మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులను నిరాశ పరుస్తూ విడుదల మళ్ళీ సమ్మర్ కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తామని ముందు ఊరించి ఆ తర్వాత వెనుకడుగు వేయడం ఊహించనిది. దీని సంగతలా ఉంచితే తర్వాత చేయబోయే సినిమా మీద మాత్రం ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. సైరా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో అఖిల్ ని సాలిడ్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ లో బ్లాక్ బస్టర్ ఇస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఇందులో ఒక సూపర్ కాంబినేషన్ సెట్ చేశారని ఇన్ సైడ్ టాక్. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, ధృవ విలన్ అరవింద్ స్వామిలను ఇందులో ముఖ్యమైన పాత్రలకు ఎంచుకున్నట్టు తెలిసింది. ఆ డీటెయిల్స్ బయటికి రాలేదు కానీ ప్రాధమికంగా చర్చలు జరిగినట్టు సమాచారం. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మనమంతా సక్సెస్ కాకపోయినా జనతా గ్యారేజ్ క్యారెక్టర్ చాలా పేరు తీసుకొచ్చింది. లాలెట్టన్ స్క్రీన్ ప్రెజెన్స్ దాని సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.
ఇక అరవింద్ స్వామి గురించి చెప్పేదేముంది. ధృవలో ప్రతినాయకుడిగా చేయడానికి ముందు రోజా, బొంబాయి లాంటి క్లాసిక్స్ ద్వారా మనకూ బాగా పరిచయమే. ఒకవేళ ఈ వార్త నిజమైతే అఖిల్ 5వ మూవీకి చాలా క్రేజ్ తోడవుతుంది. స్పై థ్రిల్లర్ తరహాలో ఎవరూ ఊహించని అంశాలతో సూరి ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఐదేళ్లు దాటుతున్నా డెబ్యూ అయ్యాక హిట్ లేకుండా ఇంకా వెయిటింగ్ లోనే అఖిల్ ఆశలన్నీ బ్యాచిలర్ కన్నా ఎక్కువగా సూరి సినిమా మీదే ఉన్నాయి. మరి అక్కినేని వారసుడికి కోరుకున్న బ్రేక్ దాంతో అయినా దక్కుతుందేమో చూడాలి