మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనిషికి సేవ చేయడమే భగవంతుడి సేవతో సమానం.
భగవద్గీతలో ఒక మాట ఉంది (కర్మ యోగం).
శ్రేష్టమైన వాడు ఏది చేస్తాడో ఇతరులు కూడా అదే చేస్తారు. అతడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో మిగిలిన వాళ్లు కూడా అదే తీసుకుంటారు.
మనదేశంలో స్వాములు, బాబాలు వేల సంఖ్యలో ఉన్నారు. దాంట్లో వేలకోట్ల ఆస్తిపరులు కనీసం వంద మంది ఉంటారు. వీళ్లు నిరంతరం భగవంతుడి గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఒక రకంగా దేవుడి ప్రతినిధులమని భావిస్తూ ఉంటారు. మానవ కళ్యాణం కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు.
ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు యోగం నేర్పిస్తారు. కొందరు ధ్యానం, మరి కొందరు Art Of Living.
అందరూ కూడా భగవద్గీత శ్లోకాలు చెబుతూ ఉంటారు. వందల ఎకరాల ఆశ్రమాలు, వేలల్లో శిష్యులు, ఎస్టేట్లు, సొంత విమానాలు, రాజభోగాలు, జీవితం గురించి వీళ్లు ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు.
జీవితం ఇక్కడ కష్టాల్లో పడింది. లక్షల మంది రోడ్లపై నడిచారు. లక్షల్లో అన్నం, నీళ్లు లేక చిక్కుకుపోయారు. లాక్డవున్ ప్రభావంతో కనీసం 30 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని అంచనా.
మరి మానవ జీవితాన్ని ఆధ్యాత్మిక సంపన్నం చేయడానికి అవతరించిన ఈ బాబాలు, స్వామిజీలు ఎక్కడ? ఆధ్యాత్మికత లేకపోయిన బతకొచ్చు. మరి అన్నం లేకపోతే బతగ్గలమా?
లక్షల మంది పసిబిడ్డల్ని భుజాన వేసుకుని , ఆకలితో నడుస్తుంటే దివ్యదృష్టిగల ఈ స్వాములకి కనపడలేదా? లేకపోతే వీళ్ల దృష్టిలో వాళ్లు మనుషులు కాదా?
వీళ్ల ఆశ్రమాల్లో ఆ పేదవాళ్లకి ఇంత నీడనిచ్చి అన్నం పెట్టలేని దుస్థితిలో ఉన్నారా?
భగవద్గీత చదవడానికి అక్షరాలు వస్తే చాలు. అర్థం చేసుకోడానికి ఆత్మజ్ఞానం ఉండాలి.
ఆత్మజ్ఞానం అంటే ఒక మనిషి ఇంకో మనిషి పట్ల మనిషిలా ప్రవర్తించడం