ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పక్కా ప్రణాళికతో నిర్వహించినట్లు ప్రకటనకు ముందు ఆయన వ్యవహరించిన తీరును బట్టి తెలుస్తోంది. నిన్న ఉదయం పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదలవ్వాల్సి ఉండగా.. దాని కోసమే ఈసీ మీడియా సమావేశం పెట్టారని అందరూ అనుకున్నారు. ఆ అంచనాతోనే విలేకర్లు మీడియా సమావేశానికి వెళ్లారు.
విలేకర్లు ఈ భావనతోనే వస్తారని తెలిసిన ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. వాయిదా అంశాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. మీడియా హాలులోకి రాగానే విలేకర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని ఆయన ఆదేశించారంటే సమాచారం బయటకు వెళ్లకూడదనే లక్ష్యంతో ఇలా చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఉండబోవని ముందుగానే రమేష్‌కుమార్ ప్రకటించారు. తాను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే మీడియా ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పేవారు. కరోనా వైరస్ ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ఈసీ.. అధికారులను సస్పెండ్ చేస్తూ తర్కంలేని నిర్ణయాలను వెల్లడించారు. ఈ అంశాలపై మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు రమేష్‌కుమార్ వద్ద సమాధానం లేదు కాబట్టే.. ఆయన ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందే ప్రశ్నలకు జవాబిచ్చే కార్యక్రమం ఉండదని చెప్పారనడంలో సందేహం లేదు.
ప్రెస్మీట్లో రమేష్‌కుమార్ ఓ అంశంపై కొంచెం ఎబ్బెట్టుగా వ్యవహరించారు. అది కూడా వాయిదా అంశంలో ఆయన ప్రవర్తించిన తీరుపై అనుమానాలను కలిగిస్తోంది. ఎన్నికల వాయిదా ప్రకటనను తెలుగు, ఇంగ్లీష్లలో చదివి వినింపిచిన రమేష్‌కుమార్… ఆ ఉత్తర్వులపై మీడియా సమావేశంలో విలేకర్ల సాక్షిగా సంతకం చేయాల్సిన అవసరం ఏముంది.? అంటే వాయిదా విషయం ప్రజల్లోకి నేరుగా, వెంటనే వెళ్లాలనేదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. విలేకర్ల సమక్షంలో సంతకం చేస్తే… ఇక ఈ నిర్ణయంలో మార్పు ఉండదని పరోక్షంగా అందరికీ అర్థమయ్యేలా వ్యవహరించారు. ఏమైనా తన విచక్షణాధికారాలతో అసాధారణ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈసీ అధికారాలు, విధులపై చర్చ జరిగేలా చేశారని చెప్పవచ్చు.