అభిమానులు, సినిమా ప్రేమికులు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం అక్కర్లేదు. తను ఈ లోకం విడిచి వెళ్ళిపోయి వారాలు గడుస్తున్నా ఇంకా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన దిల్ బేచారా ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మతులు పోవడం ఖాయం. సుశాంత్ చివరి సినిమాగా డిస్నీ హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ జరుపుకోబోతున్న దిల్ బేచారా అతి తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ కు అతి దగ్గరగా వెళ్లడమే కాక లైక్స్ విషయంలో 8 మిలియన్ మార్కుకు చెరువుగా వెళ్తూ ఏకంగా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ని పెద్ద మార్జిన్ తో దాటేసింది.
ఇప్పటిదాకా ఏ సినిమా ట్రైలర్ కు అన్నేసి లైకులు లేకపోవడం సరికొత్త రికార్డు. ఇంకా విడుదలకు చాల సమయం ఉంది కాబట్టి ఇది కనివిని ఎరుగని రికార్డులు సృష్టించడం ఖాయం. సుశాంత్ మీద సానుభూతితో పాటు బాలీవుడ్ లో రాజ్యమేలుతున్న నెపోటిజం (వారసత్వ పోకడ)మీద సోషల్ మీడియాలో ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. దీనికి కారణమైన వాళ్ళ సినిమాలను బాయ్ కాట్ చేయాలనే పిలుపులు కూడా ఊపందుకుంటున్నాయి. కరణ్ జోహార్, అలియా భట్ లాంటి వాళ్లకు ఇప్పటికే ఆ సెగల తాలూకు ప్రభావం మొదలైంది. అందుకే ఇదంతా సుశాంత్ లాస్ట్ మూవీ దిల్ బేచారాకు అతి పెద్ద ప్లస్ గా మారబోతోంది. విశ్లేషకుల అంచనా మేరకు ఇప్పుడీ హవా ఇలాగే కొనసాగితే డిస్నీ స్ట్రీమింగ్ హిస్టరీలోనే అత్యధికులు వీక్షించిన సినిమాగా దిల్ బేచారా రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెబుతున్నారు.
ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజనా సంఘీ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ ఒక స్పెషల్ క్యామియోలో మెరుస్తాడు. క్యాన్సర్ తో బాధ పడుతున్న హీరోయిన్ కు జీవితం మీద ఆశలు కల్పించి ఆమెను సరికొత్త ప్రయాణం వైపు తీసుకెళ్లే పాత్రలో సుశాంత్ రోల్ చాలా కొత్తగా ఉండబోతోంది. దీన్ని ట్రైలర్ లోనే చూపించేశారు కూడా. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. మొత్తానికి 8 మిలియన్ల లైకులకు దగ్గరగా తీసుకెళ్లి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మీద తమ ప్రేమనంతా చూపిస్తున్న అభిమానులు వ్యూస్ పరంగానూ 42 మిలియన్లకు టచ్ చేయించి హాఫ్ సెంచరీ అతి త్వరలోనే చేయించేలా ఉన్నారు. ఇప్పుడు యుట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో దిల్ బేచారా ట్రైలరే ఉందని వేరే చెప్పాలా