పోక్సో చట్టంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గత కొన్ని రోజులుగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. కాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు జడ్జీల శాశ్వత నియామకం జరుగుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చు లేదా మరికొన్ని ప్రతిపాదనలు జత చేస్తూ తిరిగి పంపించవచ్చు.
ఇది ఒకరకంగా బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాకు షాకిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. కాగా గత కొద్దిరోజులుగా పుష్ప గనేడివాలా ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. పోక్సో చట్ట ప్రకారం దుస్తులపై నుండి తడిమితే లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని శరీరానికి శరీరం తాకితేనే లైంగిక వేధింపుల కింద పరిగణిస్తామని ఇచ్చిన తీర్పుపై కొందరు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్ విప్పుకోవడం లాంటివి లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పు ఇచ్చి నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు.
పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పులిచ్చిన నేపథ్యంలో ఆమె శాశ్వత హోదా అంశంపై కొలీజియం సిఫార్సులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. జస్టిస్ పుష్ప వీరేంద్ర గనేడివాలా మార్చి 3, 1969 న మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని పరాట్వాడలో జన్మించారు. ఆమె వివిధ బ్యాంకులు మరియు భీమా సంస్థలకు ప్యానెల్ న్యాయవాదిగా మరియు అమరావతిలోని వివిధ కళాశాలలలో గౌరవ లెక్చరర్‌గా కూడా పనిచేశారు. పుష్ప 2007 లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2019 ఫిబ్రవరి 13 న బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెకు అవకాశం లభించింది. కానీ శాశ్వత హోదా లభించలేదు. ఈ నేపథ్యంలో జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ పుష్పను శాశ్వత జడ్జిగా సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకోవడంతో ఆమెకు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు.సుప్రీంకోర్టు కొలీజియంలో సిజెఐ బోబ్డేతో పాటు, న్యాయమూర్తులు ఎన్వి రమణ మరియు ఆర్ఎఫ్ నరిమాన్ ముగ్గురు సభ్యులు భాగంగా ఉన్నారు.