2013లో ‘స్వామిరారా’తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే టాలెంట్ నిరూపించుకున్న సుధీర్ వర్మ మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ అందుకోని మాట వాస్తవం. నాగ చైతన్యతో చేసిన ‘దోచేయ్’ నిరాశపరచగా నిఖిల్ ‘కేశవ’ జస్ట్ కమర్షియల్ గా సేఫ్ అయ్యిందే తప్ప గొప్ప పేరేమి తీసుకురాలేదు. స్క్రీన్ ప్లే అందించిన ‘కిరాక్ పార్టీ’ కూడా దెబ్బేసింది. శర్వానంద్ కోరిమరీ చేసిన ‘రణరంగం’ కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఏడాదిపైగా గ్యాప్ తీసుకున్న సుధీర్ వర్మ ఇప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. లాక్ డౌన్ లో ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేశారట.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒకరు నివేదా థామస్ కాగా మరొకరు రెజీనా. ఒక కొరియన్ సూపర్ హిట్ థ్రిల్లర్ రీమేక్ గా ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేయబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి. అసలు హీరోలు ఉంటారా ఉండరా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుందనేది మాత్రం కన్ఫర్మ్. సురేష్ నిర్మాణం అంటే సబ్జెక్టులో ఏదో గట్టి కంటెంటే ఉంటుంది. త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.
లాక్ డౌన్ వల్ల నిర్మాతలు భారీ బడ్జెట్ ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా స్టార్ల వెనుక తిరగకుండా ప్రేక్షకులను మెప్పించాలంటే ఏం చేయాలనే దాని మీదే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే పేరున్న దర్శకులు సైతం ఇలా రాజీ సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఓటిటి సంస్థలు క్వాలిటీ ఉంటే ఎంత పెట్టుబడికైనా సిద్ధం అయిపోయి హక్కులు కొంటున్నారు. అందుకే ఇలాంటి సినిమాలు గత కొంత కాలంగా ఎక్కువగా సెట్ అవుతున్నాయి. తక్కువ టైంలోనే పూర్తి చేసి వీలైనంత త్వరగా థియేటర్లలో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయి