బిహార్ లో రాజకీయ పార్టీలన్నీ వేగవంతంగా ఎన్నికల సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 28న తొలి విడత పోలింగ్ జరగనుంది. బిహార్‌లో ఇప్పటి వరకు అధికార జేడీ(యూ)-బీజేపీతో కూడిన ఎన్డీయే, ఆర్జేడీ-కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన మహాకూటమి ఉండగా తాజాగా ఆర్ఎల్ఎస్పీ, ఏఐఎంఐఎం మరో నాలుగు పార్టీలతో మూడో కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో చతుర్ముఖ పోటీ ఉండనుంది. ఇదిలాఉండగా శివసేన కూడా పోటీకి సిద్ధమవుతోంది. ఒంటరిగానే పోటీకి సై అంటోంది. దాదాపు 50 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ ప్రకటించారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
స్టార్ క్యాంపెయినర్ గా మోదీ..
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అన్ని పార్టీలూ ప్రచారకులను సిద్ధం చేశాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రచారకుల జాబితాను విడుదల చేశాయి. మొదటి దశ ప్రచారానికి 30 మంది స్టార్ ప్రచారకుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో పీఎం నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఈ జాబితాలో మరికొందరు నాయకులలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, మనోజ్ తివారీ ఉన్నారు. వీరందరూ ప్రచారానికి సమాయత్తం అవుతున్నారు.
కాంగ్రెస్ నుంచి సోనియా.. మన్మోహన్..
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారానికి 30 స్టార్ ప్రచారకుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, మీరా కుమార్, గులాం నబీ ఆజాద్, ప్రియాంక గాంధీ, మదన్ మోహన్ ఝా, అశోక్ గహ్లోత్, అమరీందర్‌సింగ్, భూపేష్ బాఘేల్, సచిన్ పైలట్, కీర్తి ఆజాద్, సంజయ్ నిరుపమ్ సహా మొత్తం 30మంది బిహార్ లో తొలి విడత ఎన్నికలకు ప్రచారం చేయనున్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎంపీ అనిల్ దేశాయ్ తెలిపారు. మరికొందరి పేర్లను ఆయన ప్రకటించారు.