ఈ నెల 6న తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. అన్నాడీఎంకే, డీఎంకే రెండూ.. పోటాపోటీగా ప్రచారం చేయడం, స్పందన కూడా అలాగే ఉండడంతో ఫలితంపై ఉత్కంఠ ఏర్పడింది. డీఎంకేకే అనుకూల సంకేతాలు ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నప్పటికీ, అన్నాడీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు కూడా పెద్దగా లేవని ప్రకటించడం ఉత్కంఠను మరింత పెంచింది. కానీ, ఆ ఉత్కంఠ వీడాలంటే మే 2 వరకూ ఆగాలి.
తమిళనాడు రాజకీయ నేతల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అందులో ఎవరి విజయం దాగుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు. ప్రస్తుతం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. ఆయా కేంద్రాల వద్ద 24 గంటలు తుపాకులతో ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. దాంతో పాటు పలు రాజకీయపార్టీల పోలింగ్ ఏజెంట్లు పర్యవేక్షిస్తున్నారు. అంతేగాకుండా అభ్యర్థులు కూడా అడపాదడపా వెళ్లి స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆండిపట్టి, పెరియకుళం, బోడినాయకనూరు, కంభం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ వద్ద 96 ఖాళీ ట్రంకుపెట్టెలు ఉండడం కలకలం రేపింది.
కొన్ని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ తదితర పరికరాలను తేని పట్టణంలోని కొడువిళార్పట్టి ప్రాంతంలో ఉన్న కమ్మవారి సంఘ విద్యాసంస్థ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో అధికారులు భద్రపరిచారు. ఈ నేపథ్యంలో బోడినాయకనూరు డీఎంకే అభ్యర్ధి తంగతమిళ్‌సెల్వన్, పెరియకుళం అభ్యర్ధి శరవణకుమార్, డీఎంకే న్యాయవాదులు రాజశేఖర్, సెల్వం బుధవారం స్ట్రాంగ్‌రూంకు వెళ్లిన సమయంలో అక్కడ 96 ఖాళీ ట్రంకు పెట్టెలు పడివున్నాయి. అవి అక్కడకు ఎలా వచ్చాయంటూ ఆ సమయంలో అక్కడున్న డీఎస్పీలు ముత్తురాజ్, సయ్యద్ బాబులను ప్రశ్నించారు. ఇందుకు పోలీసులు చెప్పిన సమాధానంతో వార సంతృప్తి చెందలేదు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… కౌంటింగ్ కేంద్రాన్ని సీసీ టీవీ ద్వారా రెవెన్యూ శాఖ అధికారులు పర్యవేక్షించాలని, కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లి వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద జరుగుతున్న పరిణామాలు తమకు అనుమానం కలిగిస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఎలాంటి అవకతవకలు జరుగకుండా భద్రత పటిష్టం చేశామని, ప్రధాన పార్టీల ఏజెంట్లు షిఫ్టు పద్ధతిలో 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని పోలీసు అధికారులు వివరించారు. ఫలితాలు వెలువడడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది. ఈలోపు ఎన్ని అనుమానాలు, ఉదంతాలు వెలుగులోకి వస్తాయో అన్నది ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.