జనవరి 8,1902 న అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఒక కొత్త చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం వీధిలోకి వచ్చిన మగవారు ఎవరైనా స్త్రీలను అదోలా చూస్తే పోలీసులు కేసు పెడతారు. రుజువైతే 25 డాలర్ల జరిమానా విధిస్తారు. ఇదే నేరం రెండోసారి చేసినట్లేతే వీధిలోకి వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తి చూపు అటూఇటూ పడకుండా గుర్రాలకు కట్టినట్లు గంతలు కట్టుకుని రావాలి. ఈ చట్టంలో సమస్య ఏమంటే “అదోలా” అంటే ఏమిటో సరిగా నిర్వచనం లేదు. నేరం ఆరోపించబడిన వ్యక్తి అదోలా చూశాడని నిరూపించవలసిన బాధ్యత పోలీసులదే. తన క్లయింట్ అదోలా కాదు మరోలా చేశాడని అతని తరఫున వాదించే లాయర్ నిరూపించగలిగితే కేసు కొట్టేస్తారు. అయితే జరిమానా కన్నా లాయరు ఫీజు ఎక్కువగా ఉండడంతో కొంతమంది తమ కేసులు తామే వాదించుకుంటే, మరికొందరు జరిమానా చెల్లించి వెళ్ళిపోయారు. అతికొద్ది సమయంలోనే ఈ చట్టాన్ని పట్టించుకోవడం మానేశారు కానీ ఇప్పటికీ న్యూయార్క్ రాష్ట్రంలో ఈ చట్టం ఉంది.
చట్టం గాడిద లాంటిది
Law is an ass అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. ఇది 1838లో ఛార్లెస్ డికెన్స్ రచించిన అలివర్ ట్విస్ట్ నవలతో ప్రాచుర్యంలోకి వచ్చినా, 1654 లోనే జార్జి ఛాప్ మన్ ఒక నాటకంలో రాశాడు. చేతనైన వ్యక్తి బరువు వేస్తే మోసే గాడిద చేతకాని వాడి మూతి మీద కాలితో తన్నినట్టు చట్టం కూడా తెలివైన వారికి అనువుగా, తెలివిలేని వారికి వ్యతిరేకంగా పని చేస్తుందన్న అర్థంలో ఈ సామెత చెప్పారు. అయితే అప్పట్లో కోర్టులు, న్యాయమూర్తులు తమ మనోభావాలు దెబ్బతీసుకుని కోర్టు ధిక్కరణ కింద ఈ ఇద్దరి మీద కేసులు పెట్టలేదు కానీ, కొన్ని చట్టాలను చూసినప్పుడు ఎప్పుడో ఎత్తివేయవలసిన చట్టాలు ఇంకా ఉండటం చూస్తే ఈ సామెత నిజమేమో అనిపిస్తుంది.
భారతదేశంలో ఇప్పటికీ టెక్నికల్ గా అమలులో ఉన్న చట్టం 1934లో చేసిన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ చట్టం. దీని ప్రకారం గాలిసహాయంతో గాలిలోకి ఎగిరే ఎలాంటి వస్తువుకైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. హాట్ ఎయిర్ బెలూన్లూ, గాలిపటాలు, గ్లైడర్లు లాంటివి ఎగరవేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 1885లో చేసిన ఇండియన్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కొరియర్ సర్వీసులు నడపేవారు, వాటిలో పార్సిళ్ళు పంపించేవారు కూడా శిక్షార్హులే. 1948లో చేసిన ఫాక్టరీస్ చట్టం ప్రకారం రాత్రి వేళల్లో ఆడవారితో ఫాక్టరీలలో పని చేయించడం నేరం.
1878 లో చేసిన ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అన్న చట్టం ప్రకారం ఎవరికైనా పదకొండు రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే వాటిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లో అప్పగించాల్సి ఉంటుంది. కాలంతో పాటు భారత శిక్షా స్మృతి మార్చుకుంటూ పోతున్నారు కానీ, కాలం చెల్లిన ఇలాంటి చట్టాలమీద ఎవరూ దృష్టి పెట్టకపోవడం వలన ఇలాంటి తలాతోకా లేని చట్టాలు ఇంకా పుస్తకాలలో ఉన్నాయి.
అమెరికాలో కూడా
ఇలాంటివే హాస్యాస్పదమైన చట్టాలు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. న్యూయార్క్ రాష్ట్రంలో ఆడవారు బిగుతుగా, వంటికి అతుక్కొని ఉన్న బట్టలు ధరించి వీధుల్లో తిరగకూడదు అని ఒక చట్టం ఉంటే, ఇండియానాలో వెల్లుల్లి తిన్న నాలుగు గంటల లోపు సినిమాకి పోవడం కానీ, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణం చేయడం కానీ నేరం. అయోవా రాష్ట్రంలో అయిదు నిమిషాల కన్నా ఎక్కువ సేపు ముద్దు పెట్టుకోకూడదు అని ఒక చట్టం ఉంటే, మసాచుసెట్స్ రాష్ట్రంలో పడకగదికున్న తలుపులు, కిటికీలు మూసుకోకుండా గురకపెట్టడం నేరం అవుతుంది. ఆ దేశం ఈ దేశం అని లేకుండా కాలంచెల్లినా ఎవరూ పట్టించుకోని తలాతోకా లేని చట్టాలు అన్ని చోట్లా ఉన్నాయి.