కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును దేశంలో వివిధ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు వల్ల తలెత్తే నష్టాల వల్లే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల హక్కులకు భంగం ఏర్పాడుతుందనే విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్రాలు సుముఖతం వ్యక్తం చేయటం లేదు. విద్యుత్ రంగంపై రాష్ట్రాలకు ఉండే హక్కులు ఈ బిల్లుతో కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతాయని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఏకపక్షంగా కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి, దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఈ బిల్లు విఘాతం కల్గించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 3న విద్యుత్ శాఖ మంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో 11 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్లుండగా, కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరీ బిల్లును వ్యతిరేకించాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లుపై చర్చ జరుగుతుంది. బిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీహార్ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.
ఎందుకు ఆయా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి..?
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం తమ ఎజెండా కాదని కేరళ స్పష్టం చేసిందని తెలిపిందని ఎఐపిఇఎఫ్ ప్రతినిధి వికె గుప్తా తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి బదులు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంపై పంజాబ్ అభ్యంతరం తెలిపిందన్నారు. కేంద్రం చేపట్టే అన్ని నియామకాల్లో రెగ్యులేటరీ కమిషన్ల కోసం సెలక్షన్ కమిటీ ఉండాలన్న ప్రతిపాదనను కూడా తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థను నీరుగార్చుతోందని మహారాష్ట్ర విమర్శించిందన్నారు. విద్యుత్ రంగంపై అధికారం ఉమ్మడి జాబితాలో ఉన్నందున, విధాన పరమైన విషయాలకు సంబంధించి ఏదైనా సవరణ చేసే ముందు రాష్ట్రాలను సంప్రదించాలని బీహార్ పేర్కొన్నట్లు గుప్తా చెప్పారు.
విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని బీహార్ తీవ్రంగా తప్పు పడుతోందని చెప్పారు. రాజస్తాన్ అయితే ఈ బిల్లును రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొందని వివరించారు. డిబిటితో పాటు, ప్రైవేటీకరణ, పునరుద్ధరణ కొనుగోలు బాధ్యత వంటి నిబంధనలను తమిళనాడు వ్యతిరేకిస్తోందని తెలిపారు.