దేశంలోనూ, రాష్ట్రంలోనూ దళితుల మీద దాడుల విషయంలో పోలీస్ యంత్రాంగం తీరు పలుమార్లు విమర్శలకు దారితీసింది. బాధితుల పట్ల పోలీసుల తీరు ఎన్ హెచ్ ఆర్ సీ కూడా తప్పుబట్టిన దాఖలాలున్నాయి. ఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన యంత్రాంగం కొన్ని సందర్భాల్లో నిందితులకు అండగా నిలిచిన అనుభవాలు కూడా కోకొల్లలు. కానీ విశాఖ పోలీసులు ఓ దాడి జరిగిన వెంటనే స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నిందితుల అరెస్ట్ విషయంలో చూపిన చొరవ పోలీసులకు మంచి మార్కులు సాధించి పెట్టింది. అందులోనూ సినీ నిర్మాత ఇంట్లో ఘటన జరిగినప్పటికీ, ఏమాత్రం తాత్సార్యం చేయకపోవడం విశేషంగా మారింది.
సినీ నిర్మాత, బిగ్ బాస్ తో పేమస్ అయిన నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనం విషయంలో విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తీరు అందరినీ ఆకట్టుకుంది. గతంలో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్ లో శిరోముండనం ఘటనలోనూ, చీరాల లో మరో దళిత యువకుడి మరణం విషయంలోనూ కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు ఈసారి వేగంగా స్పందించడం విమర్శలను కూడా ఆశ్చర్యపరిచింది. శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. ఆ తర్వాత మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం 11గం.ల సమయంలో బాధితుడు, ఇతర సంఘాలతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీపీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
కేసు వివరాలను వెల్లడించడమే కాకుండా, నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని వివరించారు. నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో సీసీ ఫుటేజ్ ని విడుదల చేశారు. ఘటనను బట్టబయలు చేశారు. జాప్యం లేకుండా, వాస్తవాలు దాచకుండా వెంటనే స్పందించిన సీపీ చివరకు బాధితుడిని తమ పక్కన కూర్చోపెట్టుకుని మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో ఫిర్యాదు నమోదు కావడం కోసమే చాలా ప్రయాస పడాల్సి ఉంటుంది. ఆ తర్వాత విచారణ పేరుతో తాత్సార్యం ఉంటుంది. ఇక నిందితులను అరెస్ట్ చేసే వరకూ వెళ్లాలంటే చాలా కథ నడుస్తుంది. కానీ ఈ కేసులో అలాంటి వాటికి భిన్నంగా పోలీస్ కమిషనర్ ప్రదర్శించిన చొరవను దళిత సంఘాలు ప్రశంసిస్తున్నాయి.
అదే సమయంలో ఈ కేసులో నూతన్ నాయుడి పాత్ర మీద కూడా విచారణ జరుగుతుందని సీపీ వెల్లడించారు. ఎవరి పాత్ర ఉన్నప్పటికీ వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. తద్వారా వేగంగా స్పందించిన సీపీ తీరుతో చివరకు నిందితులు పరారు కావడానికి అవకాశం లేకుండా పోయింది. ముందస్తు బెయిళ్లు ఇతర కారణాలతో తప్పించుకునే అవకాశాలను ఇవ్వకుండా పోలీసులు వేగంగా కదలడం ఉపయోగపడిందని బాధితుడు సైతం చెబుతున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ కి ఛాన్సివ్వకుండా పోలీస్ యంత్రాంగం కదలడం ద్వారా పోలీసులకు మంచి మార్కులు దక్కినట్టేనని చెప్పవచ్చు. పలు సందర్భాల్లో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనే పోలీసులు ఇటీవల పులివెందుల ఎస్సై, ఇప్పుడు విశాఖ సీపీ కారణంగా ప్రతిష్ట పెంచుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. పులివెందుల ఎస్సై సాహసోపేతంగా మద్యం మాపియాను అడ్డుకునే ప్రయత్నం చేసిన తీరు ఇప్పటికే అందరి నుంచి అబినందనలు అందుకున్న విషయం తెలిసిందే.