నాసిక్ ఆస్పత్రిలో గత వారం ఆక్సిజన్ ట్యాంకర్ లీకయి సరఫరా నిలిచిపోవడంతో 24 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ రెండు ఆస్పత్రుల్లో 50 మంది ప్రాణవాయువు అందక చనిపోయారు. హరియాణాలోని హిసార్‌లో ఐదుగురు కొవిడ్ రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో నలుగురు, రేవారీలోని ప్రభుత్వ హాస్పిటల్లో నలుగురికి ఆక్సిజన్ అందక ఊపిరాగిపోయింది. దేశ రాజధాని దిల్లీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో లిక్విడ్ ఆక్సిజన్ కొరత, దాని వల్ల జరుగుతున్న విషాదాలకు నిదర్శనాలివీ. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశమంతటికీ ఆక్సిజన్ అందించేలా బృహత్తర ప్రణాళికలు రచిస్తోంది. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ లను వడివడిగా ప్రారంభింపచేస్తోంది. ఉత్పత్తి ప్రారంభానికి కావాల్సిన సకల చర్యలూ ఆగమేఘాల మీద చేపడుతోంది.
పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఉత్తరాదిన హరియాణా, మధ్య భారత్‌లో మధ్యప్రదేశ్ వరకూ దేశ వ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ఆస్పత్రుల బయట ‘ఆక్సిజన్ అవుటాఫ్ స్టాక్’ అనే బోర్డులు పెట్టారు. లఖ్‌నవూలోని ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే రోగులను వేరే ఆస్పత్రులకు వెళ్లమని చెబుతున్నాయి.దిల్లీలోని చిన్నా పెద్ద ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ కూడా అదే చెబుతున్నాయి. చాలా నగరాల్లో రోగుల బంధువులు స్వయంగా సిలిండర్లు తీసుకుని రీ ఫిల్లింగ్ సెంటర్ల దగ్గర క్యూల్లో ఉండడం కనిపిస్తోంది.
హైదరాబాద్‌లోని ఒక ఆక్సిజన్ ప్లాంట్ బయట గుమిగూడిన జనాలను అదుపు చేయడానికి బౌన్సర్లను కూడా పిలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం ఆక్సిజన్ అందించిన ఘనత తెలిసిందే. ఇప్పుడా ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత పెంచి, ఉత్పత్తి పెంచడంతో ఇతర ప్రాంతాల్లో మూతపడి ఉన్న ప్లాంట్ లను ప్రభుత్వం త్వరితగతిన ప్రారంభిస్తోంది.
ఆయా జిల్లాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్‌కు అనుగుణంగా కలెక్టర్ లు చర్యలకు ఉపక్రమించారు. మూతపడిన ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి సారించి ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. వారి వినతికి వెనువెంటనే ప్రభుత్వం అనుమతులను మంజూరు చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు ఆక్సిజన్ సరఫరా పైపులైన్లను ఇదివరకే ఏర్పాటు చేయడంతో ‘సెకెండ్ వేవ్’ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతోంది. ఆక్సిజన్ కొరత దేశ వ్యాప్తంగా వణుకు పట్టిస్తున్నా, ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఆక్సిజన్ ఇబ్బందులు వచ్చిన దాఖలాలు లేవు. ఆక్సిజన్ ఉత్పత్తికి గల అన్ని దారులనూ ప్రభుత్వం అన్వేషిస్తోంది. అనంతపురం జిల్లాలో అధికార యంత్రాంగం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యలు ఫలితాలనిస్తోంది. శింగనమలలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంటుతో పాటు హిందుపురం నియోజకవర్గంలో తూముకుంట వద్ద ఉన్న సాయికృష్ణ ఆక్సిజన్ గ్యాసెస్ ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గుర్తించారు. అయితే ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తికి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేయించారు. తద్వారా ఈ రెండు ప్లాంట్లలో ఏకంగా ప్రతి రోజూ 700 సిలిండర్ల మేర ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడింది.