దేశమంతా కరోనా విలయ తాండవాన్ని అరికట్టడానికి లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది.
గత నెలలో జ్యోతిరాదిత్య తిరుగుబాటులో కమలనాథ్ ప్రభుత్వం కూలి బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అయితే శివరాజ్ సింగ్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయక ముందే లాక్ డౌన్ మొదలయ్యింది.
జనతా కర్ఫ్యూ ముగిసిన రెండవ రోజు అంటే 23-Mar-2020న శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికే లోక్ డౌన్ విధించటానికి రంగం సిద్దమయ్యింది.శివరాజ్ ముఖ్యమంత్రి అయిన మూడో రోజు 25-Mar-2020న లాక్ డౌన్ మొదలు కావటం గమనార్హం. దీని మీద అప్పట్లోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి
కరోనా విపత్తు సమయంలో కూడా మంత్రివర్గం ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే విషయం మీద కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్ఖా ట్విటర్ వేదికగా కనీసం ఆరోగ్య మంత్రిని కూడా నియమించకుండా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సరికొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.”శివరాజ్‌సింగ్,మీకు శుభాకాంక్షలు. దేశంలోనే మంత్రివర్గం ఏర్పాటు చేయకుండానే ఒక రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన ముఖ్యమంత్రిగా మీరు రికార్డు సాధించారు.ఇలాగే గతంలో మీ బీజేపీ పార్టీకే చెందిన యాడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా 24 రోజులు పాలించారు. మీరిద్దరూ కూడా కాంగ్రెస్ ఫిరాయింపుదారుల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు”అని ట్వీట్ చేశారు.శివరాజ్ సింగ్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అన్యాయంగా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని గద్దె దించారని విమర్శించారు.
గత మార్చిలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోలేదని జ్యోతిరాదిత్య సింధియా పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశాడు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన వర్గానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు పలికాడు.దీంతో మార్చి 23న శివరాజ్‌సింగ్ చౌహాన్ నాలుగోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ నాటికి ఆయన ప్రభుత్వం ఏర్పడి 25 రోజులు పూర్తయింది.కానీ నేటికీ క్యాబినెట్ ఏర్పాటు చేయకపోవడంతో చౌహాన్ పాలనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తున్న తరుణంలో కనీసం రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేకపోవడం శోచనీయం. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం లేదని విమర్శిస్తున్నారు.