మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాసి వారం రోజులు గడిచినప్పటికీ దానిపై రగడ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ కోశ్యారీ రాసిన లేఖలో వాడిన సెక్యులర్ పదాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అసంతృప్తి వెలిబుచ్చిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గవర్నర్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.
కరోనా కట్టడిలో భాగంగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలో ప్రార్థన స్థలాలు మూసివేశారు. దసరా పండగ సందర్భంగా రాష్ట్రంలో దేవాలయాలు తెరవడంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్, గవర్నర్ కోశ్యారీల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఉద్ధవ్ జీ, మీరు అకస్మాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా? అని ప్రశ్నించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
శనివారం ఓ ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గవర్నర్ కోశ్యారీ లేఖలో వాడిన పదాలను తప్పు పట్టాడు. గవర్నర్ రాసిన లేఖలో రిఫర్సెన్గా వాడిన పదాల ఎంపికలో మరింత సమన్వయం పాటించాల్సిందని అమిత్‌షా అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో మహావికాస్ ఆఘాడీ పక్షాన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గవర్నర్‌పై విమర్శలు గుప్పించాడు.
గవర్నర్ రాసిన లేఖలో వాడిన భాష సరికాదని సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి పేర్కొన్న తర్వాత కూడా ఆత్మ గౌరవం ఉన్న ఎవరైనా ఈ పదవిలో కొనసాగారు అంటూ గవర్నర్‌ని పవార్ ఎద్దేవా చేశారు.ఏదైనా డిమాండ్ చేయడానికి మేము ఎవరు? కేంద్ర హోంమంత్రి లేఖలోని భాషపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలా? వద్దా? దానిపై ఆలోచిస్తారు అని కోశ్యారీకి చురకలు అంటించాడు.
కాగా గవర్నర్ లేఖను అమిత్ షా తప్పుపట్టడంతో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తమ బాధను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం.