మన దేశంలో వెబ్ సిరీస్ ల ట్రెండ్ గొప్ప స్థితికి చేరుకుంటోందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. రేటింగ్ కోసం ప్రామాణికంగా తీసుకునే ఐఎండిబి లో గత ఏడాది సోనీ లివ్ లో వచ్చిన స్కామ్ 1992 ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ సిరీస్ గా నిలబడింది. ఏకంగా 9.6 రేటింగ్ తో హాలీవుడ్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ ని దాటేసి మరీ అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది. 90వ దశకంలో స్టాక్ మార్కెట్ ని తన మార్కెట్ తెలివితేటలతో కుంభకోణం చేసి వేలాది కోట్ల రూపాయలను మాయం చేసిన హర్షద్ మెహతా కథను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ ఒక్క షో కారణంగానే సోనీ లివ్ చందాదారులు లక్షల సంఖ్యలో పెరిగిపోయారు.
అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సిరీస్ లుగా పేరు తెచ్చుకున్న డార్క్, మనీ హీస్ట్ లాంటి వాటిని దాటుకుని మరీ స్కామ్ 1992 ఈ ఘనతను అందుకోవడం విశేషం. దీని దెబ్బకే ఇదే కథతో అభిషేక్ బచ్చన్ చేసిన ది బిగ్ బుల్ సినిమా కనీస స్థాయిలో స్పందనకు నోచుకోలేకపోయింది. విడుదల ఆలస్యం చేసినా ఫలితం దక్కలేదు. స్కామ్ 1992ని తెరకెక్కించిన విధానం, అప్పటి పరిస్థితులు వాతావరణాన్ని చూపించిన తీరు భాషతో సంబంధం లేకుండా అందరిని అలరించింది. సుదీర్ఘమైన 8 గంటలకు పైగా ఉన్న మొత్తం ఎపిసోడ్లను ఒకేసారి చూసినవారు లక్షల్లో ఉన్నారు. ఆఖరికి దీని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సిగ్నేచర్ ట్యూన్ గా మారిపోయింది.
దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇండియాలోనూ వెబ్ సిరీస్ కు గొప్ప మార్కెట్ దక్కబోతోంది. కంటెంట్ ఉండాలే కానీ వీటి కోసం సినిమా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తారని ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ రుజువు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కుటుంబ ప్రేక్షకులు కూడా ఎపిసోడ్ల రూపంలో ఉండే వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. రోజుకు ఒకటి చూసినా వారం పది రోజుల్లో పూర్తి చేయొచ్చు. తెలుగులోనూ వీటి ట్రెండ్ ఊపందుకుంటోంది. అన్నట్టు స్కామ్ 1992 తరహాలోనే ఇప్పుడు సోనీ లివ్ మరో కుంభకోణం కాన్సెప్ట్ ని తీసుకుని ఇదే హన్సల్ మెహతా దర్శకత్వంలో 2003లో జరిగిన స్టాంప్ పేపర్ స్కామ్ ని చూపించబోతున్నారు.