కన్నడ హీరోయిన్ సంజన, డ్రగ్స్ వివాదంలో ఇరుక్కున్న విషయం విదితమే. ఆమెను ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. కాగా, విచారణ సందర్భంలో సంజన, విస్తుగొలిపే వాస్తవాల్ని వెల్లడించారంటూ కన్నడ సినీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమాచారం ప్రకారం చూస్తే, సంజనకి ఇప్పటికే పెళ్ళయిపోయిందట. ఓ డాక్టర్‌తో ఆమె కొంతకాలంపాటు సహజీవనం చేసిందనీ, ఆ తర్వాత ఇద్దరికీ వివాహం జరిగిందనీ తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఇటు సంజన కుటుంబ సభ్యులుగానీ, అటు విచారణ అధికారులుగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. సంజన పెళ్ళి అంటూ కొన్నాళ్ళ క్రితం ఊహాగానాలు విన్పించిన విషయం విదితమే. అప్పట్లో ఆ ప్రచారాన్ని స్వయంగా సంజన ఖండించింది. ‘నేను సింగిల్‌గానే వున్నాను..’ అంటూ ఆమె ప్రకటించింది కూడా. మరి, ఈ గాసిప్స్ ఎలా వస్తున్నాయి.? ఇంతకీ ఆమెను పెళ్ళాడిన డాక్టర్ ఎవరు.? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైవాహిక జీవితంలో వచ్చిన వివాదాలతో సంజన, మానసిక ఒత్తిడికి గురై, డ్రగ్స్ మోజులో పడిందని అంటున్నారు. అయితే, ఇదంతా ఓ కట్టు కథ అనీ, సంజనకి డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదనీ, సంజనకి వున్న కొంతమంది స్నేహాతుల కారణంగానే ఆమె ఇప్పుడు ఈ వివాదంలో ఇరుక్కోవాల్సి వచ్చిందని సంజన సన్నిహితులు చెబుతున్నారు. సంజన తెలుగులో ‘బుజ్జిగాడు’ తదితర సినిమాల్లో నటించిన విషయం విదితమే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో పెద్దగా ప్రాధాన్యత లేని ఓ చిన్న పాత్రలో ఆమె కన్పించింది.