1970లో సంబరాల రాంబాబు సినిమాలో “విన్నారా విన్నారా” అనే పాటకి s.v. రంగారావు కామెడీగా స్టెప్స్ వేసి డ్యాన్స్ చేశాడు. అప్పటికే SVRకి పెద్ద పేరు. గంభీరమైన పాత్రలు వేసేవాడు. ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్. K.బాలచందర్ డైరెక్షన్. తెలుగులో GVR. శేషగిరిరావు దర్శకత్వం. పాట షూటింగ్లో స్టెప్స్ వేసి డాన్స్ చేయడానికి SVR ఒప్పుకోలేదు. తన ఇమేజ్ పోతుందని అన్నాడు. అయితే రీమేక్ సజావుగా జరిగేలా కోఆర్డినేషన్ కోసం తమిళ నటుడు నాయర్‌ని షూటింగ్ స్పాట్లో పెట్టారు. ఆయన SVRకి నచ్చ చెప్పాడు. తెర మీద SVR డాన్స్ చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
పెద్ద డైలాగ్‌లు, బరువైన కథలతో సినిమాలు వస్తున్న రోజుల్లో ఈ సినిమా పెద్ద రిలీఫ్. మధ్య తరగతి మనుషులు, వాళ్ల ఆశ దురాశలు, మనస్తత్వం బేస్ చేసుకుని బాలచందర్ నాటకం రాశారు. స్టేజ్ మీద హిట్. దాన్నే సినిమాగా తీస్తే సూపర్‌హిట్. హీరోగా నగేష్ చేశాడు. దీని హక్కులు కొని చలం సొంత బ్యానర్ రమణ చిత్ర పేరుతో తీశారు. రమణకుమారి ఆయన మొదటి భార్య. 1964లో ఆమె అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఆమె జ్ఞాపకంగా ప్రొడక్షన్‌కి ఆ పేరు పెట్టుకున్నారు. తర్వాత చలం , శారద పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు.
బాలచందర్ స్టేజి నాటకాలకి సంగీతం అందించే కుమార్ ఈ సినిమాకి పనిచేశారు. “మామా చందమామా , జీవితం అంటే అంతులేని ఒక పోరాటం , పొరిగింటి మీనాక్షమ్మని చూసారా , విన్నారా విన్నారా సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు” హిట్‌సాంగ్స్. మాటలు, పాటలు రాజశ్రీ రాసారు. నిజానికి మాటలన్నీ బాలచందర్వే. రాజశ్రీ అనువాదం చేసారు.
డిగ్రీ చదువుకున్న బాలచందర్‌కి మొదట గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దాంతో ఆయన తృప్తి పడి వుంటే గుమాస్తాగా మిగిలేవారు. రిజైన్ చేసి సినిమా డైరెక్టరై కమలహాసన్, రజనీకాంత్లని ప్రేక్షకులకి అందించారు.
సంబరాల రాంబాబులో శారద హీరోయిన్గా నటించారు. అప్పటికే మనుషులు మారాలి సినిమాతో ఆమెకి గుర్తింపు వచ్చింది. పద్మనాభం , గీతాంజలి ఒక జంట. గీతాంజలికి సినిమాల పిచ్చి. ప్రతి సందర్భాన్ని ఏదో సినిమాలోని సీన్‌తో పోలుస్తూ వుంటుంది. దగ్గుల తాత అనే క్యారెక్టర్ సీన్లో వుండదు. అతని దగ్గు మాత్రమే వినిపిస్తూ వుంటుంది.
విశేషం ఏమంటే లారీ డ్రైవర్‌గా పనిచేసే SVR ఇంట్లోనే టైర్లకు పంక్చర్ వేస్తూ వుంటాడు. పైగా లారీ టైర్‌కి సైకిల్ పంప్‌తో గాలి కొడతాడు.
రావికొండలరావు ఒక కథ రాస్తే రూ.50 పారితోషకం పంపుతారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. రచయితలకి అంత గౌరవం వుండేది. ఇప్పుడు పారితోషకం ఇవ్వడానికి పత్రికలే లేవు. ఉన్నవి కూడా ఏదో ముష్టి విదిలిస్తాయి.
ఢిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్లి పెద్ద ఆఫీసర్‌గా తిరిగొచ్చిన హీరో జీతం 1970లో రూ.700. టాక్సీ బాడుగ ఐదు రూపాయలు.
సీహెచ్. కృష్ణమూర్తి అప్పటి ప్రముఖ కామెడీ విలన్ నాగభూషణం స్టైల్లో డైలాగ్‌లు చెబుతాడు. ఇదే స్టైల్ చిత్రంభళారే విచిత్రంలో బ్రహ్మానందానికి వాడారు.
కమెడియన్‌గా అప్పటికే గుర్తింపు వున్న అల్లు రామలింగయ్య బీచ్‌లో బుడగలు అమ్మేవాడిగా ఒక చిన్న పాత్ర వేయడం ఆశ్చర్యం.
గయ్యాళి క్యారెక్టర్‌గా వేసిన సూర్యకాంతం, కూతురు శారద పెళ్లి చూపులు, పెళ్లి , ఈ రెండు సీన్స్‌లో కనిపించదు.
డైలాగులు ఎంత స్పార్క్‌గా సెటైరిక్‌గా వున్నాయో చెప్పడం కంటే చూడడం బెటర్. 2 గంటల 40 నిమిషాల సినిమా 50 ఏళ్ల తర్వాత కూడా బోర్ కొట్టకపోవడం విశేషం.