ఇంకా మొదలుకాలేదు కానీ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపొందబోయే భారీ చిత్రం అప్పుడే పలు సంచలనాలకు వేదికగా మారుతోంది. ఈసారి శంకర్ ఫిక్షన్ జోలికి వెళ్లకుండా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి కమర్షియల్ సినిమాని ప్లాన్ చేశారట. స్క్రిప్ట్ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని సంతృప్తికరంగా వచ్చాకే అనౌన్స్ మెంట్ ఇచ్చారని తెలిసింది. సంగీతం తమన్ ఇచ్చే అవకాశాల గురించి ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. వకీల్ సాబ్ ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ వేసవిలోనే మొదలు పెడతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ వేసిన కేసునుంచి శంకర్ కు కొంత ఊరట లభించడం శుభపరిణామం.
లేటెస్ట్ అప్ డేట్ అయితే ఇంకా కిక్కిచ్చేలా ఉంది. ఈ మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉండొచ్చనే వార్త ముంబై మీడియాలో లీకై ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. చాలా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ దాదాపు హీరోతో సమానంగా జర్నీ చేస్తుందని అందుకే సల్మాన్ రేంజ్ స్టార్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువ గైన్ రాబట్టుకోవచ్చని శంకర్ ఆలోచనగా తెలుస్తోంది. మెగా ఫామిలీతో సల్మాన్ ఖాన్ కు మంచి ర్యాపొ ఉంది. అతని ప్రేమ్ రతన్ ధన్ పాయో తెలుగు డబ్బింగ్ లో చరణ్ స్వయంగా గొంతు ఇచ్చింది ఈ కారణంతోనే. హైదరాబాద్ వచ్చినప్పుడంతా సల్మాన్ కు చరణ్ ఇంటి నుంచి బిర్యానీ వెళ్తుంది.
ఈ లెక్కన చూస్తే నిజంగా సబ్జెక్టు డిమాండ్ చేస్తే సల్మాన్ నో చెప్పకపోవచ్చు. ఇది కనక ఓకే అయితే చరణ్ లక్కు బాగున్నట్టే. గతంలో జంజీర్ లో సంజయ్ దత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్. అఫీషియల్ అయ్యేదాకా ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇది లీక్ అయ్యాక సోషల్ మీడియాలో అభిమానుల హంగామా గట్టిగానే ఉంది. శంకర్ దీన్ని కేవలం ఏడాది లోపే పూర్తి చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. దిల్ రాజుకు ఆ మేరకు హామీ కూడా ఇచ్చారట. చరణ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో కనిపించబోతున్నాడు. మార్పులేమీ లేకపోతే ఆచార్య మే 13, ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న వచ్చేస్తాయి