కరోనా వైరస్‌పై రష్యా తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు.టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్ తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు.కరోనా వైరస్‌పై టీకా అభివృద్ధి చేసిన తొలిదేశంగా రష్యానిలిచింది’ అని పుతిన్ ప్రకటించారు. ఈరోజు ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని ఆయన దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కోను ఆదేశించారు.
ప్రపంచం కోసం వేసిన అత్యంత కీలకమైన ముందడుగు ఇది. పుతిన్ కుమార్తె కూడా ఈ టీకా ప్రయోగాల్లో భాగమయ్యారు. తొలిసారి ఆమెపై టీకాను ప్రయోగించాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరింది. తర్వాతి రోజు 37 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. అంతే..ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. రెండో టీకా తర్వాత కూడా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగి.. తర్వాత తగ్గింది. ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో సమృద్ధిగా యాంటీబాడీలు తయారయ్యాయి’’ అని అన్నారు. కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది.ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ..‘‘భవిష్యత్తులో ఈ టీకాను భారీ స్థాయిలో మనమే ఉత్పత్తి చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం కూడా. ఈ టీకా అభివృద్ధిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
ఈ టీకాపై ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.రష్యా అభివృద్ధి చేసిన టీకాలను రెండు చోట్ల తయారు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కో వెల్లడించారు. విదేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) చూసుకుంటుందన్నారు. ది గమలేయా రీసెర్చి ఇన్స్టిట్యూట్, బిన్నోఫార్మా అనే కంపెనీలో తయారు చేయనున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే పలు వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా.. రష్యా మాత్రం ఒక అడుగు ముందుకేసింది. ఈ వారం వాటిని సామాన్య ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 18న ఈ టీకాపై తొలి ప్రయోగాలు మొదలయ్యాయి. మొత్తం 38 మంది వాలెంటీర్లపై దీనిని ప్రయోగించారు. వీరందరిలో ఇమ్యూనిటీ పెరిగింది. తొలి బృందాన్ని జులై 15న డిశ్చార్జి చేశారు. రెండో బృందం జులై 20న డిశ్చార్జైంది.
గమలేయా రీసెర్చి ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాలో రెండు వేర్వేరుగా ఇంజెక్ట్ చేసే పదర్థాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తాయి.
దీనికి తోడు చాలా తక్కువ మందిపై క్లీనికల్ పరీక్షలు నిర్వహించడంతో చాలా దేశాలు పెదవి విరుస్తున్నాయి. రష్యా తయారు చేసిన కరోనా టీకా వివరాలను ఆద్యంతం రహస్యంగానే ఉంచింది. గతనెల టీకా అభివృద్ధి చేసినట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. కానీ, ఈ టీకాకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.లాన్సెట్, న్యూఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో కూడా దీనిపై ఎటువంటి సమాచారం రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ టీకాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
భారత్‌లో ఆక్స్ఫర్డ్ టీకా ధర రూ.225 ఉంటుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఒక మంచినీటి సీసా కన్నా తాము తయారు చేసే టీకా ధర తక్కువగా ఉంటుందని భారత్ బయోటెక్ వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా టీకా కోసం భారీ రేసు జరుగుతోంది. 139 టీకాలు ప్రీ క్లీనికల్ దశలో, 25 ఫేజ్1లో, 17 ఫేజ్2లో, 7 ఫేజ్3లో ఉన్నాయి. ఈ రేసులో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా, మోడెర్నా-ఎన్ఐఏఐడీ, సైనోవాక్ మూడో దశలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వుహాన్ ఇన్స్టిట్యూట్, బీజింగ్ ఇన్స్టిట్యూట్, బయోన్టెక్-ఫూసన్ ఫార్మా, భారత్ బయోటెక్, నోవాక్స్, క్యాడిల్లా హెల్త్‌కేర్ టీకాలు ఉన్నాయి. భారత్‌లో ఆక్స్ఫర్డ్ టీకా ధర రూ.225 ఉంటుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది.