తెలుగు రాష్ట్రాలలో రోజుల వ్యవధిలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈ నెల 1 నుంచి తెలంగాణ రాష్ట్రం లో చార్జీలు పెరగగా, తాగాజా ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడిచింది. సంస్థ ను నష్టాల నుంచి గట్టెంక్కించడానికి అనే కారణంతోనే రెండు రాష్ట్రాలలో చార్జీలు పెంచారు.పల్లె వెలుగు, సిటీ సర్వీస్ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ.10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ.20 పైసల చొప్పున పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెరిగిన చార్జీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో త్వరలో ప్రకటించనున్నారు.
ఏటా రూ.1200 కోట్ల నష్టాలు చవిచూస్తూ వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే స్వల్పంగా చార్జీలు పెంచుతూ నిర్ణయం తీçసుకున్నామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇప్పటికే నష్టాలు రూ.6,735 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం చార్జీలు పెంచినా, ఆర్టీసీ ఇంకా రూ.300 కోట్ల నష్టాల్లో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పట్లేదన్నారు.
ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని మంత్రి నాని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఆస్తులను పంచుకోవాల్సి ఉందని, వాటి పంపకం పూర్తయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అసెంబ్లీలో దీనిపై చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు.