నిన్న చెప్పినట్టుగానే ఆర్ఆర్ఆర్ టీమ్ కీలకమైన అప్ డేట్ ఇచ్చింది. ఏదో మొక్కుబడిగా పోస్టర్ రూపంలో విషయాన్ని చెప్పకుండా రాజమౌళి చాలా తెలివిగా షూటింగ్ రీ స్టార్ట్ అవుతున్నప్పుడు జరుగుతున్న తతంగాన్ని వీడియో రూపంలో షూట్ చేయించి నిమిషంన్నర దాకా ఉన్న టీజర్ రూపంలో విడుదల చేయడం ఆకట్టుకునేలా ఉంది. మార్చ్ దాకా అంతా సవ్యంగానే జరిగిందని అయితే ఊహించని మహమ్మారి వల్ల ప్రపంచంతో పాటు తాము కూడా మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఇకపై డబుల్ స్పీడ్ తో కొనసాగిస్తామని చెబుతూ మెసేజ్ తో మొదలుపెట్టారు. ఆర్టిస్టులు ఎవరిని ఇందులో రివీల్ చేయకపోయినా ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా వీడియోని కట్ చేశారు. మొదటిసారి రియల్ లొకేషన్ ని స్పష్టంగా చూపించారు. దుస్తులు, ఆయుధాలు, బ్రిటిష్ కాలం నాటి వాహనాలు, సైనికుల సామగ్రి, అప్పటి రాజప్రసాదాలను తలపించే కట్టడాలు, తలుపులు హంగామా ఓ రేంజ్ లో ఉంది.
అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా జక్కన్న తన తెలివిని చక్కగా చూపించాడు. స్పాట్ లో రాజమౌళితో ఆయన భార్య, నిర్మాత, మిగిలిన టెక్నీషియన్లు, పని చేసే స్టాఫ్ అందరూ ఎలా సన్నద్ధం అవుతున్నారో నీట్ గా చూపించారు. ఇక చివర్లో అంత రెడీ ఇక హీరోలు ఎంట్రీ ఇవ్వడమే లేట్ అనుకుంటున్నప్పుడు బుల్లెట్, గుర్రం మీద చెరొకరు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు దూరం నుంచి వాటి మీద రావడాన్ని లాంగ్ షాట్ గా బ్లర్ చేసి చూపించి అక్కడితో ముగించేశారు. అక్టోబర్ 22న కొమరం భీంగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ టీజర్ విడుదల అవుతుందని అందులో చెప్పేశారు. సో ఇంకో పాతిక రోజుల్లో తారక్ ను భారీ గ్యాప్ తర్వాత ప్రేక్షకులు చూడబోతున్నారు.
చాలా రోజుల క్రితమే అల్లూరి సీతారామరాజుగా చరణ్ ని చూశాక తమ హీరో టీజర్ ని రిలీజ్ చేయాలనీ యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక తీరబోతోంది. సో ఆర్ఆర్ఆర్ ఇకపై అప్రతిహతంగా షూటింగ్ జరుపుకోబోతోందన్న మాట. ఇదే స్పీడ్ తో కొనసాగిస్తే వచ్చే వేసవికి విడుదల కావడం కష్టమేమి కాదు. ఇంకా చాలా టైం ఉంది. అయితే రాజమౌళి ఈసారి తొందరపడి రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు మాత్రం లేవు. కరోనా ఇంకా పూర్తిగా కట్టడి కాలేదు కాబట్టి షూటింగ్ మొత్తం పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజికి వెళ్ళినప్పుడే ఏదైనా కాన్ఫిడెంట్ గా చెప్పగలరు. అలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్, సముతిర ఖని, శ్రియ శరన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ఆర్ఆర్ఆర్ కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. సో ఇకపై రెగ్యులర్ గా ఆర్ఆర్ఆర్ నుంచి అప్డేట్స్ రావడం ఖాయమనే క్లారిటీ వచ్చేసిందిగా
Link Here @ https://bit.ly/2vWbv5G