ఆళ్లగడ్డ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడటమే కాకుండా.. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని రాజకీయంగా దాదాపు తెరమరుగైన టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ మళ్లీ ఉనికి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుని, రచ్చ చేయడానికి ప్రయత్నించారు. విస్తరణలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ.. దాన్ని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా అని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డిని సవాల్ చేశారు. దానికి ఎమ్మెల్యే సై అంటూ రాజకీయ లబ్ధికోసమే అఖిలప్రియ మంచి కార్యక్రమాన్ని రచ్చ చేస్తున్నారని విమర్శించడంతో రాజకీయ ఉద్రిక్తతలు అలుముకున్నాయి.
విస్తరణలో అవినీతి నిరూపిస్తా..
ఆళ్లగడ్డలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్లో బస్ షెల్టర్‌ను తొలగించడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా మాజీమంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్ రెడ్డి తమ తండ్రి నిర్మించిన షెల్టర్‌ను ఎలా తొలగిస్తారంటూ అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆయనపై కేసు నమోదు చేశారు. దాంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. రోడ్డు విస్తరణలో స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చివేస్తున్నారని.. పరిహారం సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో విచారణకు హాజరైతే నిరూపిస్తానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. నిరూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి సిద్ధమా అని అఖిలప్రియ సవాల్ చేశారు.
సై అన్న ఎమ్మెల్యే
అఖిలప్రియ సవాల్ ను ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి స్వీకరించారు. ఆమె ఆరోపణలను తిప్పికొట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం అఖిలప్రియ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజామోదంతో రోడ్డు విస్తరణ, మురుగు కాలువల నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తే పరిహారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. మొత్తం మీద మాజీమంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే పరస్పర సవాళ్లతో ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Also Read : మంత్రితో వియ్యం.. ఆ మాజీ ఎమ్మెల్యేకు కలిసి రాబోతోందా..?