2019 చివరి రోజున హైదరాబాద్ రోడ్లు రక్తమోడాయి.హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టివేసింది. హైదరాబాద్ ఉప్పల్ లో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను, AP 24 TA 5469 నంబర్ కలిగిన ఇసుక లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులంతా హబ్సిగూడలో భాష్యం స్కూల్ లో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. కాళేశ్వరం నుండి ఇసుక లోడ్ తో నాగోల్ వెళ్తున్న లారీ ఉప్పల్ వద్ద ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఆటోలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు.
హబ్సిగూడ భాష్యం స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు యధావిధిగా ఉదయం స్కూల్ కి వెళ్తుండగా ఉప్పల్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. లారీ బలంగా ఆటోను ఢీకొట్టడంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడో తరగతి చదువుతున్న అవంత్ కుమార్ మృతి చెందాడు. సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులను స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు.లారీ అత్యంత వేగంగా దూసుకురావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు లారీ డ్రైవర్ మల్లేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ప్రమాదం అధికారుల అలసత్వానికి, పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించకుండా ఆటోల్లో స్కూల్ పిల్లలను తరలిస్తుంటే, అధికారులు కూడా చూసి చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. స్కూల్ పిల్లలకోసం ప్రత్యేకమైన బస్సులు నడపాలని నిబంధనలు చెబుతున్నా తమ స్వలాభం కోసం కొన్ని పాఠశాలలు ఆటోల్లో పిల్లలను తరలిస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని ఇటువంటి ప్రమాదాలు తిరిగి జరగకుండా నిబంధనలు పాటించని పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుని వాటి లైసెన్సులు రద్దు చేయాలనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.