అసలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏమైంది. నిజంగా సీఎం జగన్ ఏపీ ప్రజలకు సమస్యగా మారారా? లేక రాధాకృష్ణకు సమస్యనా? ఏమీ అర్థం కావడం లేదు. జగన్ అనే రాజకీయ నేత లేకపోతే రాధాకృష్ణకు వారం వారం కొత్తపలుకులు పలకడానికి కంటెంట్ ఉండేది కాదేమో…ఏమోలే అప్పుడు రాధాకృష్ణకు కొత్తపలుకు శీర్షిక నడపాలనే ఆలోచన, అవసరం వచ్చి ఉండేవి కాదేమో.
సరే జగన్‌పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి శాయశక్తులా రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారనే నిజం ఈ వారం కొత్తపలుకుతో నిర్ధారణ అయ్యింది. అయితే ఒకట్రెండు విషయాలను మాత్రమే ప్రస్తావిస్తాను. రాధాకృష్ణ రాత ఎట్లుందంటే ఒక్క జగన్ తప్ప మిగిలిన నేతలు ఏం చేసినా ఒప్పే. జగన్ ఏది చేసినా తప్పే అని తీర్పు ఇస్తున్నాడాయన.
“కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల విషయంలో అనుసరిస్తూ వచ్చిన అప్పీజ్మెంట్ పాలసీపై మెజారిటీ వర్గమైన హిందువులలో అసంతృప్తి గూడుకట్టుకుంటూ వచ్చింది. ఇది గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ హిందువులను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఫలితమే జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసినా, అయోధ్యలో వివాదాస్పద భూమిలో రామమందిరం నిర్మించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా దేశంలో ఎక్కడా అలజడులు తలెత్తకపోగా.. నరేంద్రమోదీ పరపతి మరింత పెరిగింది” ఇదీ మోడీ విషయంలో రాధాకృష్ణ ధోరణి.
“భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయమై ముఖ్యమంత్రిని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులు గంపగుత్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదం గా మారిన ‘ఇంగ్లిష్ మీడియంలోనే విద్యా బోధన’ అనే ప్రభుత్వ నిర్ణయం వెనుక కూడా మత కోణం ఉందనీ, ముఖ్యమంత్రికి రహస్య ఎజెండా ఉందనీ ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఇక మతవ్యాప్తి విషయానికి వస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, గిరిజనులు, బీసీల పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధన వల్ల బాల్యం నుంచే పిల్లలను క్రైస్తవ మతంవైపు ఆకర్షించడం సులువు అవుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి”…..చూశారా ఈ రాతల్లోని రోతను.
హిందువులను రెచ్చగొట్టడమే తన రాతల అంతిమ లక్ష్యమని ఈ వ్యాఖ్యల ద్వారా రాధాకృష్ణ చెప్పకనే చెప్పారు. ఏం హిందుత్వంపై మోడీకి మాత్రమే పేటెంట్ ఉందా? జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసినా, అయోధ్యలో వివాదాస్పద భూమిలో రామమందిరం నిర్మించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు మోడీ పరపతిని పెంచాయని సంతోషంతో సంకలు గుద్దుకుంటున్న రాధాకృష్ణ కలానికి జగన్ గుర్తుకొచ్చేసరికి వంకర్లు పోయింది.
” పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోకూడదా? అని ప్రశ్నించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేశారు. దీంతో తెర వెనుక ఉద్దేశాలను గట్టిగా ప్రశ్నించలేని స్థితిలో ప్రతిపక్షాలు, తెలుగు భాషాభిమానులు చిక్కుకున్నారు” అని వాపోయారు.
అయ్యా రాధాకృష్ణ ఎందుకీ ద్వంద్వ వైఖరి? మమీ మానసిక పరిస్థితిని చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. అందువల్లే మీకో సలహా ఇవ్వదలిచాం. ఈ రోజు మీ, మన ఆంధ్రజ్యోతి మెయిన్ రెండో పేజీలో పరంజ్యోతి శీర్షిక కింద ఓ చక్కటి ఆధ్యాత్మిక వ్యాసం ప్రచురితమైంది.
ఆత్మ..జ్ఞానం గురించి వ్యాసకర్త ఎస్ఆర్ భల్లం చెప్పిన విషయాలను చెప్పారు. ఆయన ఏమంటారంటే… “ఆత్మలేకపోతే ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. మనసు ఆలోచించలేదు. అన్నింటికీ ఆధారం ఆత్మ. ఆత్మతత్వం బోధపడిన వారు సర్వదుఃఖాల నుంచి విముక్తి పొంది ఆనందానుభవం పొందుతారు. హృదయ శుద్ధి లేకుండా , విషయ లోలత్వం విడనాడకుండా, ఐహిక వాంఛల పట్ల ఆపేక్ష చంపుకోకుండా, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించకుండా , ఆత్మజ్ఞానం లేకుండా దైవాన్ని ధ్యానించడం వల్ల ఒనగూడే ప్రయోజనం శూన్యం”
ఆత్మలేకపోతే ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయని, మనసు ఆలోచించలేదని, అన్నింటికీ ఆధారం ఆత్మ అని, ఆత్మతత్వం బోధపడిన వారు సర్వదుఃఖాల నుంచి విముక్తి పొంది ఆనందానుభవం పొందుతారని మీకు చెప్పినట్టే ఉంది సార్.
అసలే మీకు దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన స్ఫూర్తితో చివరి పలుకులు పలికే ప్రమాదం ఉందనే ఆందోళన నాలో అంతకంతకూ పెరుగుతోంది.
మొన్నటి వరకు మీ ఆత్మను చంద్రబాబుకు, ఇప్పుడేమో మోడీ-అమిత్‌షాలకు ఇచ్చారు. మీ ఆత్మను, అంతరాత్మను మీ దగ్గరకు రప్పించుకోండి. అప్పుడు కొత్తపలుకుల రాయండి. ఎస్ఆర్ భల్లం ప్రబోధించినట్టుగా సర్వదుఃఖాల నుంచి కాకపోయినా జగన్ నుంచి మీరు విముక్తి పొందడమే కాకుండా పాఠకులకూ విముక్తి కల్పించి తద్వారా ఆనందానుభవం పొందుతారని ఆశిస్తూ….