ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం ఆ పత్రిక ఎండీ రాసే కొత్తపలుకులో ఈ వారం పూర్తిగా జగన్‌పై కాకుండా కొంత స్థలాన్ని కేసీఆర్‌కు కేటాయించారు. అయితే జగన్ విషయంలో ఆయన వైఖరిలో ఏ మాత్రం మార్పు లేదు. జగన్ గురించి రాధాకృష్ణ మరో రకంగా రాస్తారని ఎవరూ ఆశించరు.
ఈ వారం రాసిన కొత్తపలుకులో రెండు అంశాలు మెచ్చుకోదగ్గవి, కొన్ని ప్రశ్నించాల్సినవి ఉన్నాయి.
ముందుగా మెచ్చుకోలు అంశాలను చూద్దాం,
“కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఈ పరిస్థితికి ఎవరు కారణం? ప్రభుత్వమా? కార్మిక సంఘాల నాయకులా? ప్రతిపక్షాలా? చివరకు హైకోర్టు కూడానా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు దొరకడం లేదు. సమ్మె ప్రారంభంలో కార్మికులలో ఆశలు చిగురింపజేసిన హైకోర్టు కూడా చివరకు చేతులెత్తేసింది. తమకు పరిమితులున్నాయని అంటూ వ్యాజ్యాలను కొట్టిపారేసింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టుగా అందరూ కలిసి ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నారని ఎవరైనా నిందిస్తే కాదనగలరా?”
హైకోర్టు విషయంలో చాలా మంది అభిప్రాయాలు రాధాకృష్ణ చెప్పినట్టే ఉన్నప్పటికీ, నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. తప్పులు పట్టడానికి మనమెవరు? కానీ రాధాకృష్ణ ధైర్యంగా హైకోర్టును కూడా ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంలో రాధాకృష్ణను ప్రశంసించకుండా ఉండలేం.
అలాగే మహారాష్ట్రలో అనూహ్యంగా ఎన్సీపీ మద్దతుతో ఫడణవీస్ ప్రభుత్వం ఏర్పాటుకావడం దేశంలో దిగజారుతున్న రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన అసహ్యించుకున్నారు. ప్రస్తుత మారిన రాజకీయ పరిస్థితుల్లో రాధాకృష్ణ కలం నుంచి ఈ మాత్రం నిరసనను అభినందించాల్సిందే.
ఇక రాధాకృష్ణను ప్రశ్నించాల్సిన అంశాలకు వద్దాం,
“జగన్ నిర్ణయాల వల్ల ప్రభుత్వం పైనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌పైన కూడా విశ్వాసం పోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనుకొనే రాష్ట్రాలు ముందుగానే ఎల్సీలు సమర్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను కూడా కేంద్రం పెండింగులో పెట్టింది. ఫలితంగా పోలవరం భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యింది. జగన్ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉంది ” అని ఆర్కే పలికారు.
మరి ఇదే కొత్తపలుకులో “ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ప్రజల పట్ల కఠినంగా కాకుండా దయార్ద్రత ప్రదర్శించాలి. పిల్లలు తప్పు చేస్తే ఎలా కడుపులో పెట్టుకుని కాపాడతారో.. ప్రజలలో భాగమైన కార్మికులను కూడా పెద్ద మనసుతో క్షమించి వదిలివేయడం సముచితం. హైకోర్టు కూడా ఇటువంటి సూచనలే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేసింది. అయినా ‘నా తెలంగాణలో నన్నే ధిక్కరిస్తారా?’ అన్న అతిశయంతో కేసీఆర్ మొండిగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు ” అని ఆర్కే హితబోధ చేశారు.
పైన పేర్కొన్న రెండింటిని మరోసారి పరిశీలిద్దాం. ఏం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు మాత్రమేనా ప్రజల పట్ల దయార్ద్రత ప్రదర్శించాల్సింది? దేశ ప్రధానికి ఈ విషయం వర్తించదా? ప్రధానికి సీఎంలు పిల్లల్లాంటి వారు కాదా? ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదని, దీంతో పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను కూడా కేంద్రం పెండింగులో పెట్టిందని, ఫలితంగా పోలవరం భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యిందని రాసిన రాధాకృష్ణకు మోడీ సర్కార్ నియంతృత్వ విధానాలపై ధర్మాగ్రహం ప్రదర్శించాలని ఏ మాత్రం అనిపించలేదు.
పైపెచ్చు ఇక్కడ కూడా నేరస్తుడు జగనే. పోలవరం భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేయడం ద్వారా ఐదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించేందుకు రాధాకృష్ణకు మనసు రాలేదు. ఎందుకంటే అక్కడ రాధాకృష్ణ కళ్లకు జగన్ అనే పొర అడ్డుగా ఉంది. అందుకే ఆయనకు ఏ చెడు జరిగినా జగనే కారణమని ఎలాంటి లాజిక్కులు లేకుండా వాదిస్తాడు.
“ఓటుబ్యాంకును పటిష్ఠం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడింట రెండొంతులలో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం ఉన్నప్పటికీ ‘‘పేదల పిల్లలు ఇంగ్లీషులో చదువుకోకూడదా?’’ అని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడం కాదు. తెలుగు మీడియంను ఎత్తి వేయడమే! అని రాధాకృష్ణ పొంతన లేని రాతలు రాశాడు.
జనానికి మంచి చేయకపోతే వారెందుకు ఓట్లు వేస్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాధాకృష్ణపై ఉంది. రాష్ర్టానికి భవిష్యత్ లేకపోతే, జగన్‌కు మాత్రం భవిష్యత్ ఎలా ఉంటుందో తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాని విషయం. ప్రభుత్వ పాఠశాలల్లో మూడింట రెండొంతులలో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం ఉన్నప్పటికీ ‘‘పేదల పిల్లలు ఇంగ్లీషులో చదువుకోకూడదా?’’ అని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశాడంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడింట రెండొంతులలో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం ఉంటే జగన్ మత మార్పిడుల కోసమే ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతూ ఏదో రహస్య అజెండాతో ముందుకు వెళుతున్నాడని గత వారం తమరు రాసిన విషపు పలుకుల మాటేమిటి స్వామి? రెండొంతల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టినప్పుడు తమరు ఎలాంటి రాతలు రాశారో తెలియజేస్తే మంచిది. జగన్ తప్ప మిగిలిన ఎవరు చేసినా తమరికి ఆమోదయోగ్యమేనా?
“రాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ స్థాయిలో చులకనభావం ఏర్పడిందనీ, జాతీయ మీడియా జగన్‌రెడ్డి నిర్ణయాలను తూర్పారబడుతోందనీ సొంత పార్టీ ఎంపీలే ఎత్తిచూపే పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి తెలుసుకోవడం మంచిది అని ఆర్కే రాసుకొచ్చాడు.
అయ్యా జాతీయ మీడియా ఆకాశం నుంచి దిగిరాలేదు. మన తెలుగు దినపత్రికలు ఎంత దరిద్రంగా ఉన్నాయో…జాతీయస్థాయిలో ఆ పత్రికలు కూడా భిన్నంగా ఏమీ ఉండవు. ఎందుకంటే భాష తేడా అయినంత మాత్రాన భావజాలంలో మార్పు ఉంటుందని ఆశించలేం. అక్షరం ముక్క తెలుగు చదవడం, రాయడం తెలియని మోడీ-అమిత్‌షా కోసం మీరే సర్కస్ ఫీట్లు చేస్తుంటే….ఇక కేంద్ర ప్రభుత్వ మెహర్బానీ కోసం జాతీయ పత్రికలు చేసే విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మీరు వ్యాసం చివరిలో చెప్పిన మాటలను కొంచెం మార్చి చెప్పుకుందాం. ఈ పత్రికలను అభిమానించే పాఠకులే ఫూల్స్‌గా మిగిలిపోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక మహా విషాదం!