శ్రీకాకుళం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావన వస్తే.. కొన్ని కుటుంబాలు తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో ప్రాంతాలవారీగా ఈ కుటుంబాలే నాయకత్వం వహించేవి. వీటిలో కొన్ని కుటుంబాల ప్రభ కాలక్రమంలో మసకబారిపోయినా ఒక కుటుంబం మాత్రం ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటోంది. అదే పాలవలస కుటుంబం. పాలకొండకు చెందిన ఈ కుటుంబం పాలకొండతో పాటు గతంలో ఉన్న ఉనుకూరు.. ప్రస్తుత రాజాం నియోజకవర్గ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్సార్సీపీలో కొనసాగుతూ ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ విజయాల్లో సూత్రధారిగా వ్యవహరిస్తోంది. ఈ కుటుంబ పెద్ద పాలవలస రాజశేఖరం బాటలోనే ఆయన కుమార్తె రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉండగా.. కుమారుడు పాలవలస విక్రాంత్ పాలకొండ నియోజకవర్గంలో ముఖ్యనేతగా ఉన్నారు.
కుటుంబమంతా రాజకీయాల్లోనే..
పాలవలస రాజశేఖరం 2009 వరకు ఉన్న ఉనుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావుకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగారు. 1994లో కళాపై ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో కాంగ్రెస్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో ఈ కుటుంబం ఆ పార్టీలో చేరి జగన్‌కు అండగా నిలిచింది. ఆయన సతీమణి ఇందుమతి గతంలో పాలకొండ ఎంపీపీగా, జెడ్పీటీసీగా.. ప్రస్తుతం రేగిడి జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. వీరి కుమారుడు విక్రాంత్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఇటీవలి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నెలలో జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకు అవకాశం లభిస్తుందంటున్నారు. ఇక విక్రాంత్ సతీమణి గౌరీపార్వతి పాలకొండ ఎంపీపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. అంతకుముందు ఆమె వీరఘట్టం ఎంపీపీగా పనిచేశారు.
రెడ్డి శాంతి రాజకీయ ప్రయాణం
పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి కూడా తండ్రి బాటలోనే రాజకీయాల్లో చేరారు. 2013లో వైఎస్సార్సీపీలో చేరిన ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా నిరుత్సాహం చెందకుండా పార్టీని,జగన్‌ను నమ్ముకుని పనిచేశారు. 2019 ఎన్నికల్లో పాతపట్నంలో పోటీ చేసి.. అక్కడి టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను ఓడించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రెడ్డి శాంతి కుమారుడు ఇటీవలే జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఈమె భర్త రెడ్డి నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారి. ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల్లో ముఖ్యమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అయితే క్యాన్సర్ బారిన పడి గత ఏడాది జూలై 21న కన్ను మూశారు. రెడ్డి శాంతి దంపతుల కుమార్తె, ఐఏఎస్ అధికారిణి రెడ్డి వేదిత వివాహం ఇటీవల జరిగింది. పాతపట్నంలో జరుగుతున్న ఆ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి జగన్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించనున్నారు.