రాయలసీమలో వైఎస్సార్సీపీ హవా మరోసారి స్పష్టమైంది. సీమ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా.. అన్ని చోట్లా వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాలు సాధించింది. ఎన్నికలు జరిగిన కడప జిల్లా కమలాపురం, రాజంపేట, కర్నూలు జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీల్లో భారీ విజయాలు నమోదు చేసింది. మున్సిపాలిటీల వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
కమలాపురంలో అధికార వైఎస్సార్సీపీ తన పట్టు నిరూపించుకుంది. ఈ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 76.59 శాతం పోలింగ్ నమోదైంది. వైఎస్సార్సీపీ 15 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ 5 వార్డులకే పరిమితం అయ్యింది. 9లో 42 ఓట్లు, 10లో 81 ఓట్లు, 11లో 83 ఓట్లు, 15లో 129 ఓట్లు, 14లో 87 ఓట్లు, 17లో 27 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు 1, 6, 12, 13, 19 వార్డుల్లో గెలిచారు.
కడప జిల్లా రాజంపేటను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 29 వార్డులు ఉండగా 67.32 శాతం పోలింగ్ నమోదైంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే 24 వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 4 చోట్ల గెలవగా 27వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇంకో వార్డు ఫలితం తేలలేదు. ఒకటో వార్డులో షేక్ సుమియా, రెండో వార్డులో దాసరి మౌనిక గెలుపొందారు. బద్వేలు మున్సిపాలిటీ 11వ వార్డులో కూడా వైఎస్సార్సీపీ గెలుపొందింది.
అనంతపురం జిల్లాలో ఎన్నిక జరిగిన పెనుకొండ నగర పంచాయతీపై వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా 82.63 శాతం ఓట్లు పోలయ్యాయి. 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధించి. నగర పంచాయతీ తొలి పాలకవర్గం ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. టీడీపీ రెండు వార్డుల్లోనే గెలవగలిగింది. పెనుకొండ ప్రాంతం తమ కోట అని చెప్పుకొంటున్న మాజీమంత్రి పరిటాల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ తదితరులు మకాం వేసి నానాపాట్లు పడినా వైఎస్సార్సీపీని ఏమాత్రం నిలువరించలేకపోవడం విశేషం. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 17వ డివిజన్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ కూడా అధికార పార్టీ ఖాతాలో చేరింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా 72.95 శాతం పోలింగ్ నమోదైంది. అధికార వైఎస్సార్సీపీ భారీ విజయాలు నమోదు చేసింది. 14 వార్డుల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేయగా.. టీడీపీ 6 స్థానాలకే పరిమితం అయ్యింది. ఆ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి బుగ్గన ప్రసన్న లక్ష్మి కూడా ఓటమిపాలు కావడం విశేషం.
Also Read : Akividu Municipality – మహా కూటమికి తిరస్కారం