ఇప్పుడంతా కమర్షియల్ ఎంటర్ టైనర్లదే హవా. ఉప్పెన లాంటి లవ్ స్టోరీలు కూడా అంత ఘన విజయం సాధించాయంటే దానికి కారణం అందులో ఉన్న మాస్ అంశాలు కూడా దానికి దోహదపడ్డాయి. అయితే స్టార్ హీరోలు ఒకప్పటిలా ఊర మసాల కథలతో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ అయ్యే రోజులు కావివి. వినోదం ఉండి తీరాల్సిందే. అప్పుడప్పుడూ క్రాక్ లాంటివి దీనికి మినహాయింపుగా నిలుస్తాయి. అందులోనూ విలన్లైన రవిశంకర్, సముతిరఖనిలతో కామెడీ చేయించడం ఇక్కడ మర్చిపోకూడదు. నిన్న సాయంత్రం రవితేజ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో మాస్ మహారాజా లాయర్ గా నటించబోతున్నట్టు సమాచారం. అలా అని వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ లో కాదు లెండి. పక్కా వినోదాత్మక యాంగిల్ లో సరదాగా ఎక్కువ సేపు సీరియస్ గా కొంత సేపు కామెడీగా ఇలా బ్యాలన్స్ గా సాగుతుందట. ఇందులో హీరోయిన్ కూడా అతనికి అపోజిషన్ లో కేసులు వాదించే క్యారెక్టర్ లో కనిపించనున్నట్టు అప్ డేట్. రాశి ఖన్నాను హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు వినికిడి. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ చేస్తున్న రవితేజ ఇంకో నెలన్నరలో దాన్ని పూర్తి చేసి త్రినాథ రావుతో జాయిన్ అవుతాడు. దీనికి ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ గోపీచంద్ ప్రస్తావన ఎందుకొచ్చిందనేదేగా మీ డౌట్. మారుతీ దర్శకత్వంలో తను చేస్తున్న పక్కా కమర్షియల్ లోనూ హీరో పాత్ర ఇంచుమించు ఇలాగే ఉంటుంది. డబ్బులిస్తే కానీ ఏ కేసు వాదించని లాయర్ గా గోపిచంద్ ని కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు మారుతీ మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇది జాలీ ఎల్ఎల్బీ ఛాయల్లో ఉంటుందని ప్రచారం జరిగింది కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇలా ఇద్దరు హీరోలు ఒకే టైపు క్యారెక్టరైజేషన్ లో సినిమాలు చేయడం విశేషమే. పక్కా కమర్షియల్ అక్టోబర్ 1 విడుదల కాబోతుండగా రవితేజ-త్రినాథరావు కాంబో మూవీ కూడా ఇంచుమించు దసరానే టార్గెట్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్