శాసనసభలో ఈ ఉదయం ఇంగ్లీష్ మీడియం మీద జరిగిన చర్చలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య కొన్ని అడ్డంకులు ఉన్నట్లు తెలిపారు.
రాపాక వరప్రసాద్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించటం మీద జనసేన ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య కొన్ని అడ్డంకులు ఉన్నట్లు రాపాక చెప్పటంతో రాజకీయ వర్గాలలో రాపాక ప్రయాణం ఎటు అన్న చర్చ నడుస్తుంది.
ఎన్నో ఆశలతో ఎన్నికల బరిలో దిగిన జనసేనకు ఒకే ఒక స్థానం గెలవటం,పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీచేసిన రెండు స్థానాలలో ఓడిపోవటంతో డీలా పడింది. జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోల్లో పవన్ కళ్యాణ్ బలం కన్నా రాపాక వరప్రసాద్ బలం,ప్రణాళిక వల్లనే జనసేన గెలిచిందన్న చర్చ జరిగింది. తాను కమిటీలు ఏర్పాటు చేసుకొని పనిచేశానని, అవి తన గెలుపుకు ఉపయోగపడ్డాయని, తనలాగే పార్టీ కూడా సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని రాపాక అభిప్రాయపడ్డారు.
ఈ వాఖ్యలు చూస్తే జనసేన పార్టీ నిర్మాణం,పని విధానం పట్ల రాపాక అసంతృప్తితో ఉన్నట్లు అర్ధమవుతుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా కేవలం ప్రభుత్వం మీద విమర్శలకే పరిమితం అవ్వటం కూడా రాపాక అసంతృప్తికి కారణం కావచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసునని రాపాక అన్నారు. చాలా మంది దళితులు ప్రవేట్ పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నానని రాపాక అన్నారు. ఈ వాఖ్యలు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనను వ్యతిరేకిస్తూ తెలుగులో చదువుకోని వారు రేపులు కాక ఏమి చేస్తారు? ఇంగ్లీష్ మీడియం వలను మతమార్పిడులు పెరుగుతాయంటూ పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాలలో మాట్లాడటాన్ని రాపాక పరోక్షంగా తప్పుపట్టినట్లుగ భావించాలి .
మొత్తంగా జనసేన నిర్ణయాలలో రాపాక వరప్రసాద్ భాగస్వామ్యం ఏమిలేనట్లు కనిపిస్తుంది.పవన్ కు తనకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని,దాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తానని రాపాక చెప్పినా అది సాధ్యమా? పార్టీ పనితీరులో స్థూల మార్పులు తీసుకురావటం రాపాక తరం అవుతుందా? రాపాక ప్రయత్నాలు ఎంతమేర పనిచేస్తాయో చూడాలి.. ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే తన దారి తాను చూసుకోవటం ఖాయం.