అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పంచాయితీ కోర్టుకు చేరడంతో రాజస్తాన్ రాజకీయాల్లో వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. స్పీకర్ అనర్హత నోటీసులపై సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది. దీంతో ఈ నాలుగు రోజుల సమయాన్ని జైపూర్‌లోని ఫెయిర్మాంట్ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్న సిఎం అశోక్ గహ్లోట్ వర్గం ఎమ్మెల్యేలు సరదాసరదాగా గడుపుతున్నారు.
అంతా ఓకే.. కానీ, కోవిడ్ నిబంధనలు
ఉదయం లేవగానే చాలా మంది ఎమ్మెల్యేలు యోగాలో మునిగిపోయారు. కొందరు మహిళా ఎమ్మెల్యేల హోటల్ చీఫ్ చెఫ్‌తో చేరి పిజ్జా, బట్టర్ పన్నీర్ చేయడం నేర్చుకున్నామని చెప్తున్నారు. ఇక సభ్యుల కోసం 1960లో వచ్చిన సూపర్ హిట్ మూడీ మొఘల్ ఏ ఆజం సినిమాను ప్రదర్శించామని హోటల్ వర్గాలు తెలిపాయి. అయితే, ఎమ్మెల్యేలెవరూ మాస్కులు ధరించకుండా ఉండటం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉండగా.. హైకోర్టులో కేసు విచారణ అనంతరం అసలు కథ మొదలు కానుంది. సచిన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత అమలైతే అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ సంఖ్య తగ్గిపోనుంది. దాంతో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం సులభంగా విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తుంది. ఒకవేళ సచిన్ వర్గానికి విశ్వాస పరీక్షలో ఓటు వేసే అవకాశం గనుక వస్తే… కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అయితే, తమకు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే రాజస్తాన్‌లో ప్రస్తుతానికి రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకున్నట్టే. 200 సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో ప్రభుత్వ మనుగడకు 101 ఎమ్మెల్యేల బలం అవసరం.
ఇదిలా ఉండగా రసవత్తరంగా సాగుతున్న రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల వ్యవహారం మరింత కాకపుట్టించింది. అశోక్ గహ్లోట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బిజెపి నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఒజి)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఒజి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.
తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని రాజస్తాన్ బిజెపి అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్ అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీఫ్ విప్ మహేష్ జోషి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, రాజస్తాన్ పిసిసి చీఫ్ గోవింద్ సింగ్, సిఎం వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న లోకేష్ శర్మలను భరద్వాజ్ ఫిర్యాదులో నిందితులలుగా పేర్కొన్నారు. ఫేక్ ఆడియో కాల్స్ సృష్టించి బిజెపిని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 8 సివిల్ లైన్స్‌లోని సజఎం అశోక్ గహ్లోట్ నివాసంలో ఓఎస్డీ లోకేష్ శర్మ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగుతున్నాయని ఆరోపించారు. నిందితులపై చర్యలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భరద్వాజ్ కోరారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.
మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోట్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి పేర్కొన్నారు.