బజాజ్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం పూణెలో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. బజాజ్ చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అనారోగ్యం ముదరడంతో గత నెలరోజులుగా రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పూర్వేజ్ గ్రాంట్ మాట్లాడుతూ ఆయనకు న్యుమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. రాహుల్ బజాజ్ మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ఆయన తుదిశ్వాస విడిచిన సమయంలో ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.
రాహుల్ జూన్ 10, 1938న కోల్‌కతాలో మార్వాడీ వ్యాపారవేత్త కమలనయన్ బజాజ్ – సావిత్రి బజాజ్ దంపతులకు జన్మించారు. రాహుల్ బజాజ్ 1965లో బజాజ్ గ్రూప్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలోనే బజాజ్ ఆటో సంస్థ టర్నోవర్ 7.2 కోట్ల నుండి 12 వేల కోట్లకు చేరుకుంది. రాహుల్ రంగంలోకి దిగిన తరువాత కంపెనీ ఉత్పత్తులకు దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్ పెరిగింది. ఆయన ఉండగానే ఇండియా టూ వీలర్ మార్కెట్ ను చాలాకాలం పాటు ఏలిన చేతక్ విడుదలయింది. అప్పటి నుంచి బజాజ్ గ్రూప్‌కు 50 ఏళ్ల పాటు ఛైర్మన్‌గా ఉన్నారు. 2005లో రాహుల్ తనయుడు రాజీవ్‌కు కంపెనీ వ్యవహారాలు ఒక్కొక్కటి అప్పగించడం ప్రారంభించారు. ఆ తర్వాత రాజీవ్‌ను బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
రాహుల్ బజాజ్ దేశంలోని విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచారు. 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అనుబంధం ఉన్న రాహుల్ బజాజ్ 30 ఏప్రిల్ 2021న బజాజ్ గ్రూప్‌లో తన పదవికి రాజీనామా చేశారు. 2001లో పరిశ్రమలు మరియు వాణిజ్య రంగంలో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అతనికి ‘నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’ అనే ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. రాహుల్ బజాజ్ 1979-80 మరియు 1999-2000లో రెండుసార్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు 2017లో జీవితకాల సాఫల్యానికి సంబంధించిన CII ప్రెసిడెంట్స్ అవార్డును అందజేశారు. రాహుల్ బజాజ్ మృతికి సాధారణ నెటిజన్లు సహా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు