వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామరాజుకు 2022 మొదటి రోజే చేదు అనుభవాలు ఎదురయ్యాయి . ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీకి చైర్మన్ , ఎండీగా ఉన్న రఘురామరాజు తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసమని వివిధ ఫైనాన్స్ కార్పొరేషన్స్ తో కూడిన పవర్ కన్సార్షియం వద్ద నుండి 947 కోట్ల రుణం తీసుకొన్నారు . అయితే రుణ ఒప్పందం ప్రకారం పవర్ ప్లాంట్ నిర్మించకుండా , నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును దారి మళ్లించి పలు బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు .
అనంతరం ఆయా బ్యాంక్స్ లో ఉన్న డిపాజిట్స్ ష్యూరిటీగా చూపి పలు బ్యాంక్స్ లో రుణం తీసుకొని పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ లు చెల్లించినట్టు చూపి దారి మళ్లించారు . ఇలా పవర్ ప్లాంట్ నిర్మాణ వ్యవహారం పూర్తిగా పక్కదారి పట్టించి తీసుకొన్న రుణాల చెల్లింపులో విఫలం కావడంతో పవర్ కార్పొరేషన్ కన్సార్షియం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో 2019 ఏప్రిల్ 29 న ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ చైర్మన్ రఘురామరాజు పై సీబీఐ కేసు నమోదైంది .
మరోవైపు పవర్ కన్సార్షియం వద్ద తీసుకొన్న రుణాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూకో బ్యాంక్స్ వద్ద డిపాజిట్ చేసి పలు బ్యాంక్స్ లో తీసుకొన్న రుణాలు తీర్చని కారణంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూకో బ్యాంక్ తమవద్దనున్న డిపాజిట్స్ బకాయి క్రింద జమ చేసుకోగా మిగతా బ్యాంక్స్ ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ ను ఎన్పీఏ గా ప్రకటించాయి .
బ్యాంక్స్ కన్సార్షియంలో మెంబర్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని ఆశ్రయించి ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ నుండి దివాలా చర్యలు చేపట్టి తమ బకాయి జమ చేయించాల్సిందిగా కోరింది . దివాళా ప్రక్రియకు వ్యతిరేకంగా రఘురామరాజు కంపెనీ న్యాయవాదులు చేసిన వాదనలతో విభేదించిన NCLT దివాలా ప్రక్రియ ద్వారా పరిష్కారానికి అనుమతిస్తూ ఒక పరిష్కార నిపుణున్ని నియమించి మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొని దివాళాకు ఒక తేదీ నిర్ణయించి , తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి వివరాలు మూడు రోజుల్లో తెలియజేయాలని డిసెంబర్ 31 న ఆదేశించింది . NCLT ఆదేశాల ప్రకారం ఈ నెల నాలుగవ తేదీన రఘురామరాజు దివాళా ఏ రోజో తెలియనుంది .
మరోవైపు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల కన్సార్షియంల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ గతంలో రఘురామరాజు ఇంటిలో సోదాలు చేయడంతో పాటు , పలువురు కంపెనీ అధికారులను విచారించి రఘురామరాజుని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇండ్ భారత్ డైరెక్టర్లు , జాయింట్ కంపెనీలు , అక్రమ లావాదేవీలు నిర్వహించిన కాంట్రాక్టర్లను , చార్టెడ్ అకౌంటెంట్స్ సహా మొత్తం పదహారు మంది పై గత డిసెంబర్ 31 న సీబీఐ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది .
పై రెండు అక్రమ వ్యవహారాల పై చర్యలకు సంభందించి 2021 సంవత్సరం చివరి రోజు కీలక పరిణామాలు సంభవించడం రఘురామరాజుకి శరాఘాతం అని చెప్పొచ్చు . ఈ కేసును మొదటినుండీ గమనిస్తున్న ఆర్ధిక నిపుణులు అభిప్రాయం ప్రకారం త్వరలో దివాళా ప్రక్రియ పూర్తి అవ్వడంతో పాటు రఘురామరాజు సహా ఇతర నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకొని జైలుకు తరలించి కోర్టు విచారణ ప్రారంభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .
అదే జరిగితే ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజు పార్టీకి వ్యతిరేకంగా పలు వివాదాల్లో భాగస్వామి కావడమే కాకుండా ప్రభుత్వం పై కుట్ర కేసులో అరెస్టయ్యి గందరగోళం సృష్టించారు . దానితోపాటు సొంత పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిలు రద్దు చేయాలని కొద్దికాలం క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు . ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సంబందం లేని విషయాల్లో తల ఎందుకు దూరుస్తారు అంటూ కోర్టు ద్వారా మొట్టికాయలు వేయించుకున్న వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామరాజు సమీప భవిష్యత్తులో తనకు , తన పరివారానికి అదే సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్లు వేయాల్సి రావొచ్చు .