నర్సాపురం ఎంపీ సవాల్ విసిరారు. ఛాలెంజ్ కూడా చేశారు. చివరకు తోక ముడిచినట్టుగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు తనకు గిట్టడం లేదని బహిరంగంగానే ప్రకటించి, అధినేతను, పార్టీ నేతలను నిత్యం విమర్శించే రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని ఆపార్టీ స్పీకర్ ని కోరింది. దానిని పార్లమెంట్ కమిటీ విచారణకు స్వీకరించింది. త్వరగా నివేదిక ఇవ్వాలని స్పీకర్ కూడా కోరారు. అటు పార్టీ ఫిర్యాదుతో పాటుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరణ కూడా కమిటీ ముందు చేరింది. నివేదిక అందించేందుకు ఇంకా గడువు ఉండడంతో వచ్చే వారం నాటికి అనర్హత వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
తన మీద అనర్హత వేటు వేయకపోతే నేనే రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. దానికి గడువు కూడా పెట్టారు. ఫిబ్రవరి 5ని డెడ్ లైన్ అంటూ పేర్కొన్నారు. అంటే ఈరోజు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానని ప్రకటించారు. అమరావతి రాజధాని తన ఎజెండా అని ప్రకటించారు. జగన్ ని వ్యతిరేకించేవారంతా తనకు మద్ధతుగా నిలవాలని కోరారు. ఏ పార్టీ తరుపున బరిలో ఉంటాననేది స్పష్టం చేయకపోయినా తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. అందరి మద్ధతు ఉంటుందని అన్నారు. తనదే మళ్లీ విజయమని డాంభికాలు పలికారు అంతా చేసి చివరకు ఈరోజు తుస్సుమనిపించారు.
తానే పెట్టుకున్న ముహూర్తం, తానే తీసుకున్న నిర్ణయం అయినా నెరవేర్చలేకపోయారు. చెప్పింది చేయలేక పోయారు. ఎంపీ పదవికి రాజీనామా విషయంలో రఘురామకృష్ణంరాజు అభాసుపాలయ్యారు. అనర్హత వేటు వ్యవహారం ఓవైపు సాగుతున్న దశలో నిజంగా వేటుపడితే తనకు మళ్లీ పోటీ చేసే అర్హత కోల్పోతాననే భయం ఆయనలో ఉంది.అయినా రాజీనామా చేస్తానని చెప్పినట్టుగా బరిలో దిగితే ఓటమి భయం కూడా వెంటాడుతోంది. దాంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు తీరు ఉంది. చివరకు కేంద్రంలో బీజేపీ పెద్దలు కొందరిని ప్రసన్నం చేసుకుంటున్నా ఫలితమిచ్చేలా లేదు. ఈ పరిణామాలతో రఘురామకృష్ణంరాజు వ్యవహారం కామెడీ సీన్ లా మారిపోయింది.
రఘురామకృష్ణంరాజు స్టేట్ మెంట్స్ ని హెడ్ లైన్స్ లో వేసి సవాళ్ళు, ఛాలెంజులంటూ ఓ సెక్షన్ మీడియా పదే పదే వాయించినా చివరకు ఆయన చెప్పిన గడువు వచ్చే సరికి పారిపోవడం ఆయన పిరికితనాన్ని చాటుతోంది. తానెంతో ధైర్యవంతుడినని చెప్పుకున్నప్పటికీ చివరకు చల్లగా జారుకోవడం చూస్తుంటే ఆయన మాటల గాంభీరమే తప్ప చేతల్లో సత్తా లేనివాడనే విమర్శలకు అవకాశమిస్తోంది.