లాక్ డౌన్ కాదు దాన్ని తలదన్నే సంక్షోభం వచ్చినా డోంట్ కేర్ అంటున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఒకపక్క థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోక బాలీవుడ్ నిర్మాతలు తమ రిలీజులు వాయిదా వేసుకుంటూ బిజినెస్ పూర్తి స్థాయిలో జరగక టెన్షన్ పడుతుంటే సల్మాన్ సినిమాలు మాత్రం ఎంచక్కా వందల కోట్ల వ్యాపారం చేసుకుంటూ వామ్మో అనిపిస్తున్నాయి. తాజాగా అతని కొత్త సినిమా రాధేని జీ స్టూడియోస్ సంస్థ అన్ని హక్కులకు కలిపి 230 కోట్లకు డీల్ చేసుకుందని ముంబై టాక్. ఇప్పుడీ వార్త అక్కడి ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. అసలు ఇంత ధర ఈ మధ్యకాలంలో ఏ మూవీకీ ఆఫర్ చేయలేదు.
ఇటీవలే మన తెలుగులో సోలో బ్రతుకే సో బెటరూని రిలీజ్ చేసింది జీ సంస్థే. ఇప్పుడు అన్ని భాషల్లోనూ థియేట్రికల్ రిలీజుల మీద దృష్టి పెడుతోంది. దానికి తగ్గట్టే నెట్ వర్క్ ని పెంచుకునే పనిలో ఉంది. రాధేకి దర్శకుడు ప్రభుదేవా. ఈ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన పోకిరి రీమేక్ వాంటెడ్ రేంజ్ లో రికార్డులు మళ్ళీ బద్దలు అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. రాధే వాస్తవానికి ఈ ఏడాది ఈద్ పండక్కు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడి ఇప్పుడు వచ్చే రంజాన్ కు ఫిక్స్ చేసుకున్నారు. ఓటిటి ఆఫర్లు మధ్యలో చాలానే వచ్చినా అన్నింటిని పక్కనపెడుతూ వచ్చారు.
నిజానికి ఇపుడున్న పరిస్థితుల్లో ఇది చాలా భారీ మొత్తం. అయితే సల్మాన్ జీతో లాంగ్ రన్ రిలేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఇతని నిర్మాణంలో పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషించిన కాగజ్ వచ్చే నెల నేరుగా జీ5 ద్వారా విడుదల కాబోతోంది. ఇంతకు ముందు వచ్చిన రేస్ 3, దబాంగ్ 3 కూడా ఇందులోనే ప్రీమియర్ అయ్యాయి. అందుకే రాధే మీద ఇంత పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ కాగా జాకీ శ్రోఫ్, రణదీప్ హుడా ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళంలోనూ డబ్బింగ్ వెర్షన్ రూపంలో రాధేని ఏకకాలంలో రిలీజ్ చేయబోతున్నారు. డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది