పేరు పీవీ..
సంస్కరణల సంజీవి..
సమస్యలను సున్నితంగా పరిష్కరించగల అపర మేధావి..
తుది వరకూ కాంగ్రెసులోనే కొనసాగిన గాంధేయ వాది..
భారత దేశ ఆర్థిక పునాదులను పటిష్టం చేసిన పీఎం..
ఆయన తెలంగాణకే కాదు.. దేశానికే గర్వకారణం.
బహుభాషా కోవిదుడు.. రాజకీయ దురంధరడు.. పాములపర్తి వెంకట నరసింహారావు ( పీవీ) తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న జన్మించారు. తెలంగాణలో పుట్టినా ఆంధ్రప్రదేశ్ బృహస్పతిగా ఆయనను అభివర్ణిస్తారు. 1957లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. ఏ పదవిలో కొనసాగినా దానికి వన్నె తెచ్చారు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
మొదటిసారిగా లోక్సభకు హనుమకొండ నుంచి ఎన్నికయ్యారు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యారు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగుపెట్టారు. 1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు.
అనుకోకుండా ఆ పదవి..
1991 లో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా… దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయనను అనుకోకుండా ప్రధాని పదవి వరించింది. రాజీవ్ గాంధీ హత్య అనంతరం అందరికీ ఆమోద యోగ్యుడి గా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టారు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు అతనుపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. తెలుగోడు ప్రధాన మంత్రి కావడంతో నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆనందానికి హద్దులు లేవు. మన తెలుగోడు ప్రధాని మంత్రి ఆయెరా.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
సంక్షోభ సమయంలో…
భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడ్డప్పుడు నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవస్థ గాడిన పడింది. దేశాన్ని పతనావస్థ నుంచి కాపాడాయి. అందుకే ఆయన ఆధునిక భారత నిర్మాతగా కీర్తించ పడ్డారు. ఒక తెలుగోడు భారత దేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయికి వెలుగెతి చాటడం మనకెంతో గర్వకారణం.
గొప్ప సాహితీవేత్త కూడా…
రాజకీయ వేత్తగానే కాదు… సాహితీ వేత్తగానూ ఆయనకు గుర్తింపు. సాహితీ అకాడమీ పురస్కార గ్రహీత కూడా. ఇంగ్లీష్, హిందీ మొత్తం 17 భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. చివరి వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగిన పీవీ 2004 డిసెంబర్ 23 న స్వర్గస్థులయ్యారు. ఈ ఆదివారం ఆయన 99 వ పుట్టినరోజు. ఏడాది పాటు పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నో అవార్డులు, అంతకు మించిన కీర్తి ఆయన సొంతం. అంతటి మహా వ్యక్తికి భారత రత్న ప్రదానం చేసే సమయం ఇదే అనే వాదన వ్యక్తం అవుతోంది. తెలుగు వారిగా మనం కూడా అదే కోరుకుందాం.