అప్పుడెప్పుడో ‘నేములో నేముంది’ అన్నాడు.. కాన్వెంట్ స్కూల్లో చదివి అటు తెలుగూ ఇటు ఇంగ్లీషూ పూర్తిగా రాని ఓ ఆంగ్లాంధ్రకవి. అంటే ఆయన భావం.. ‘పేరులో ఏముంది?’ అని అన్నమాట. నిజానికి ఆయన పొరపాటుపడ్డాడు కానీ పేరులో చాలా ఉంది. పిలుపు, గుర్తింపు, గౌరవం, పరువు, మంచి, చెడూ… ఇలా చాలా చాలా.. ఛత్రపతి శివాజీ అంటే వీరుడు గుర్తొచ్చినట్లే , శిబి చక్రవర్తి అనగానే దానగుణం గుర్తుకు రావడం సహజమే కదా.. అలాగే చిరంజీవి అంటే డ్యాన్స్, సచిన్ అంటే ఆట, బాలు అంటే పాట.. ఇలాంటివన్నీ ఈ కోవకు చెందినవే. జనాలు ఈ పేర్లను ఇలాగే గుర్తుపెట్టుకుంటారు. మరో ముఖ్యవిషయమేమంటే ప్రాంతాలను బట్టి పేర్లు, వాటి గొప్పతనాలు మారుతూ ఉంటాయ్! ఇంతకీ పేర్ల మీద ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం…
తెలంగాణలో ‘సొంతం’ కోసం..
దేన్నైనా రాజకీయం చేయడం, రాజకీయానికి వాడుకోవడంలో ‘తెలుగు’ పార్టీ(ల)ది అందెవేసిన చెయ్యి అని తెలిసిందే కదా! ఇప్పుడు ఈ కోవలోకి రెండు పేర్లు చేరాయి.. అవి పీవీ, వైఎస్ఆర్. అంటే ఇది పేర్ల పేచీ అన్నమాట. ఒకచోటేమో ఈ పేర్లను ఎవరికివారే సొంతం చేసుకోవాలనుకోవడం, ఇంకొక చోటేమో ఒక ‘పేరు’ను వాడకుండా చేయాలనుకోవడం.
స్థితప్రజ్ఞుడు, బహుభాషాకోవిదుడు, అన్నింటికీ మించి కష్టకాలంలో దేశాన్ని అప్పుల బారి నుంచి బయటపడేయడంతోపాటు సంస్కరణల బాట పట్టించిన వ్యక్తిగా మాజీ ప్రధాని పాములపర్తి వేంకట(పీవీ) నరసింహారావు ఎంతో పేరు గడించారు. అయితే, దురదృష్టవశాత్తూ ప్రధాని పదవి నుంచి దిగిపోయాక అధిష్టానం ఆయనపై శీతకన్ను వేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది.
అయితే, ఇప్పుడు హఠాత్తుగా ఆయన గొప్పతనం కాంగ్రెస్‌కు తెలిసొచ్చింది. ఇప్పటికే అధిష్టానం మాట విని వైఎస్సార్‌ను దూరం చేసుకున్న పాపానికి తెలంగాణలో ఆ పార్టీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఎలాగైనా సరే తిరిగి పుంజుకోవాలని భావించే ప్రయత్నాల్లో భాగంగా పీవీని, వైఎస్ఆర్ను తమ వాళ్లని చెప్పుకోవడానికి నానాతంటాలూ పడుతోంది. ఈ మధ్యనే జరిగిన వైఎస్ఆర్ జయంతిని ఇంతకుముందులా కాకుండా కొంచెం గట్టిగానే జరిపింది.
ఇక ఈ ఏడాది పీవీ శతజయంతిని సైతం ఘనంగానే నిర్వహించేందుకూ సిద్ధమైంది. అయితే, ఇక్కడే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకొట్టారు. విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ముందుండి నడిపిన ‘పీవీ తెలంగాణ ఠీవి’ అంటూ ఏడాది మొత్తం శత జయంతి ఉత్సవాలు జరపనున్నట్లు ప్రకటించారు. అలాగే వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, ఆయన్ను చాలాసార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. దీంతో తాను వైఎస్ఆర్కు వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పారు. ఇది వైఎస్ అభిమానులకూ తెలుసు. ఎటొచ్చీ అధిష్టానం చేష్టలతో తొలుత పీవీని, తర్వాత వైఎస్‌ను దూరం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్‌కే తిప్పలన్నీ. అందుకే ఇప్పుడు పీవీ, వైఎస్ ఇద్దరూ మా వారే అని చెప్పుకోవడానికి నానా అవస్థలూ పడుతోంది.
ఏపీలో మాయం చేయాలని..
ఆంధ్రప్రదేశ్‌లో ‘పేరు పేచీ’ మరోలా ఉంది. ఇక్కడ ‘వైఎస్ఆర్ ’ పేరును కనపడకుండా, వినపడకుండా చేయాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏళ్లుగా ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే ఆ ప్రయత్నంలో కొద్ది మేర సఫలమైంది. వైఎస్ఆర్ కడప జిల్లా పేరును తమ అనుకూల మీడియా ఇప్పటికీ ‘కడప’గానే వ్యవహరిస్తుంచేలా చేయడంలో విజయవంతమైంది. అందుకే.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు, వాటి మేలు గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం’ అనడం, ఒకవేళ ఏదైనా అవినీతి గురించో, లోటుపాట్ల గురించో చెప్పాల్సి వచ్చినప్పుడు సంబంధం లేకపోయినా కావాలనే ‘వైఎస్ఆర్ ’ పేరును ప్రస్తావించడం టీడీపీ అనుకూల పత్రికలు, చానెళ్లు ఎంతో నిబద్ధతతో పాటిస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా టీడీపీ కన్ను ఏకంగా వైఎస్ఆర్సీపీలోని ‘వైఎస్ఆర్’పై పడింది. అందులో భాగంగానే యువనేత లోకేశ్ బాబు తన బ్రహ్మాస్త్రం ట్విట్టర్లో ‘వైఎస్ఆర్ సీపీ’ని ‘యుశ్రారైకాపా’ అంటున్నారు. తాజాగా వైఎస్సార్సీపీకి స్వపక్షంలో విపక్షంలా తయారైన ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సైతం ఇదే మాటలు పలకడం వెనక అంతరార్థమూ ఇదే అనడంలో సందేహం లేదు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకు తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై స్పందిస్తూ రఘురామకృష్ణంరాజు ఇదే మాటలు వల్లె వేశారు. తాను గెలిచింది ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ నుంచి అని తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీస్‌లు ఇవ్వడం సమంజసం కాదని వింత వ్యాఖ్యానం చేశారు.
వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని ఫ్యాక్షనిస్టుగా, దుర్మార్గుడిగా, అవినీతి పరుడిగా చిత్రీకరించడంలో బాబు అండ్ కో, అనుకూల మీడియా పాత్ర ఎప్పటికీ మరచిపోలేనిది. ఆయన మరణించాక సైతం ఇప్పటికీ అదే ధోరణి అనుసరిస్తూనే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం వైఎస్ఆర్ కడప జిల్లా పేరు. వైఎస్ఆర్ మరణించాక ఆయన పేరును కడప జిల్లాకు పెట్టారు. కానీ, ఇది తమకు వర్తించదన్నట్లు ఇప్పటికీ టీడీపీ అనుకూల మీడియా కడప జిల్లా అంటుందే తప్ప, ‘వైఎస్ఆర్ కడప’ ఎక్కడా రాయదు, పలకదు.
నిజానికి వైఎస్ఆర్ అవినీతి పరుడైతే ఆయన పేరును వాడుకోవడం వైఎస్ఆర్ సీపీకి నష్టమే కదా? అలా జరిగితే అది టీడీపీకి లాభమే కదా. మరి చినబాబు అండ్ కో ‘యుశ్రారైకాపా’ అని అంటున్నారంటే వైఎస్ఆర్ పై తాము వేసిన చెడు ముద్రలు తప్పు అని, వైఎస్ఆర్ అంటే సంస్కరణల ముఖ్యమంత్రి అని, అందుకే ఆ పేరును, ఆయన రూపాన్ని జనం గుండెల్లో ముద్రించుకున్నారని ఒప్పుకున్నట్లే కదా? ఆ విషయం ఎందుకు ఆలోచించడం లేదో చినబాబు గారు! తాము ఎత్తుకున్న పల్లాయిని, తమ భజన మీడియాతో నమ్మించొచ్చు అని నమ్ముతున్నారు కాబోలు.
ఇది సోషల్ మీడియా కాలమని మర్చిపోతే ఎలా చినబాబు గారు?! మీరు పేరు మార్చినా, ఏమార్చాలని చూసినా అది ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే వైఎస్ జగన్ అంటే వైఎస్సార్ కుమారుడని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అంతేకాదు, ‘ఆరోగ్యశ్రీ, అభయహస్తం, ఫీజు రీ ఎంబర్స్మెంట్, 108, జలయజ్ఞం..’ ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ వైఎస్ఆర్ను గుర్తుచేస్తూనే ఉంటాయి. అందుకే ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. చినబాబు, పెదబాబు గారూ.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు పెట్టి ఉంటే ప్రజలు మిమ్మల్నీ గుర్తుపెట్టుకుని ఉండేవారు. మీ పేరునూ స్మరించుకునేవారు. కాదంటారా?
చివరాఖరున మీ మేలు కోరి ఓ మాట. అసలే చినబాబు తెలుగు అంతంతమాత్రం. ఇప్పటికే మీ పాండిత్యం తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఏదో ట్విట్టర్ కాబట్టి సరిపోతోంది కానీ.. ఇలా నోరు తిరగని ‘యుశ్రారైకాపా’ను రేపు ఎప్పుడైనా ప్రజల మధ్యలో మీ నోటి నుంచి పలకాల్సి వస్తే జాగ్రత్తండోయ్. అపశృతులు పలికితే అంతే సంగతులు!!
Read Also ; కొల్లు బెయిల్ ఆశ కూడా ఆవిరైంది..!