పంజాబ్ కాంగ్రెసులో హై కమాండ్ కుదిర్చిన రాజీ బెడిసికొట్టింది. పరిస్థితి మరింత దిగజారింది. తాజా పరిణామాలు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు శనివారం సాయంత్రం అత్యవసర సీఎల్ఫీ మీటింగుకు ఏఐసీసీ ఆదేశించడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. శనివారం ఉదయం నుంచి రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం అమరీందర్ రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎంవో వర్గాలు దీనిని ఖండిస్తున్నా.. ఆయన తన అనుయాయులతో సమావేశమై రహస్య మంతనాలు జరపడం ఆసక్తి రేపుతోంది.
ఏడాదికిపైగా విభేదాలు
పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే నవజ్యోత్ సిద్ధూ, అమరీందర్ మధ్య విభేదాలు రాజుకున్నాయి. తన శాఖల్లో సీఎం కోత పెట్టినందుకు నిరసనగా సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేసి అసమ్మతివాదిగా మారారు. అమరీందర్ కు వ్యతిరేకంగా అసమ్మతివర్గాన్ని కూడగట్టారు. దాంతో అధిష్టానం రంగంలోకి దిగి సిద్ధూ, అమరీందర్ తోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులతో సుమారు రెండు నెలలు చర్చోపచర్చలు జరిపి రాజీ సూత్రం రూపొందించింది. దాని ప్రకారం గత నెలలో సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు.
ఆ ముచ్చట కొద్దిరోజులకే తీరిపోయింది. గత నెల చివరిలో నలుగురు మంత్రుల ఆధ్వర్యంలో 25 మంది ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అమీరందర్ పై తమకు విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటించారు. నలుగురు సభ్యుల బృందం ఢిల్లీ వెళ్లి సోనియాకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే దీని వెనుక పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ ఉన్నారని అప్పట్లో అమరీందర్ వర్గం ఆరోపించింది.
Also Read : కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు…?
తాజాగా 40 మంది ఎమ్మెల్యేల లేఖ
తాజాగా 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై అపనమ్మకం ప్రకటిస్తూ అధిష్టానానికి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన 18 అంశాల ప్రణాళికను అమలు చేయడంలో సీఎం అమరీందర్ విఫలం అయ్యారని.. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే నష్టపోతామని ఆ లేఖలో స్పష్టం చేశారు. దానికి స్పందించిన పంజాబ్ వ్యవహారాల ఇంఛార్జి హరీష్ రావత్ శనివారం సాయంత్రం 5 గంటలకు అత్యవసర సీఎల్ఫీ సమావేశం ఏర్పాటు చేయాలని ట్విటర్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు సిద్ధూను ఆదేశించారు. అదే పోస్టును రాహుల్ గాంధీకి, సీఎం అమరీందర్ కు ట్యాగ్ చేశారు. ఆ మేరకు పీసీసీ కార్యాలయంలో సీఎల్ఫీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు సీఎం అమరీందర్ మొహాలీలోని తన నివాసంలో విధేయులైన కొందరు ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించారు. తాజా పరిణామాలపై మంతనాలు జరిపారు. సాయంత్రం జరిగే సీఎల్ఫీ సమావేశానికి పరిశీలకులుగా హరీష్ చౌదరి, అజయ్ మాకెన్ హాజరుకానున్నారు. భేటీలో అమరీందర్ ను కార్నర్ చేసేందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారు. ఆయన రాజీనామాకు వారందరూ పట్టుబట్టే అవకాశం ఉంది. పరిస్థితి తనకు వ్యతిరేకంగా మారుతుండటంతో సీఎల్ఫీ భేటీకి ముందే సీఎం అమరీందర్ రాజీనామా చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : ఆఫర్ల ఆప్..!టార్గెట్ యూపీ ఎలెక్షన్