నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవలే ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నప్పటికీ పుదుచ్చేరి కేబినెట్ ఏర్పాటుపై మల్లగుల్లాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ – ఎన్ ఆర్ కాంగ్రెస్ మధ్య పంపకాలు కొలిక్కి రావడం లేదు. బీజేపీ డిమాండ్లకు రంగస్వామి తలొగ్గడం లేదు. తాము అనుకున్న పదవులు సాధించుకునేందుకు ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని బీజేపీ పావులు కదుపుతోంది. తన బలం పెంచుకుంటూ ఎన్ ఆర్ కాంగ్రెస్ కు చమటలు పట్టిస్తోంది. 30 మంది ఎమ్మెల్యేలున్న పుదుచ్చేరి శాసనసభకు ఇటీవల వెల్లడైన ఫలితాల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలను, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్ 2, స్వతంత్రులు ఆరు స్థానాలను కైవసం చేసుకున్నారు. సీఎం పదవిపై బీజేపీ, రంగస్వామి మధ్య కాస్త సయ్యాట జరిగినా, చివరకు పుదుచ్ఛేరికి ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా సీనియర్ రాజకీయవేత్త రంగసామి ప్రమాణ స్వీకారం చేశారు.
సీఎం పదవి వదులుకున్న తమకు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌తో పాటుగా, రెండు కీలక శాఖలతో కూడిన మంత్రి పదవుల్ని కట్ట బెట్టాలని బీజేపీ ఆది నుంచీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ డిమాండ్లకు తలొగ్గేది లేదన్నట్టుగా పుదుచ్చేరి సీఎం రంగస్వామి సంకేతలిస్తున్నారు. దీంతో స్థానిక బీజేపీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. పరిస్థితిని చక్క దిద్దేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్రం రంగంలోకి దించింది. ఇప్పటికే బీజేపీ తమ బలాన్ని పెంచుకునే రీతిలో స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపుగా బీజేపీ తిప్పుకుని బలం పెంచుకుంది. ఈ పరిణామాల్ని రంగస్వామి నిశితంగానే పరిశీలిస్తూ వచ్చారు. బీజేపీ బలం తాజాగా 12కు చేరడంతో రంగస్వామి సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ బీజేపీ ముఖ్య నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, సమస్య పరిష్కారానికి తమ పార్టీ ముఖ్యులతో సమాలోచనలు చేస్తున్నారు.
స్థానికంగా సమస్య పరిష్కారం కాకపోవడం, రంగస్వామి మెట్టుదిగకపోవడంతో పుదుచ్చేరి బీజేపీ నేత నమశ్శివాయం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నిర్మల్‌కుమార్ సురానాతో పాటుగా పలువురు నేతలు ఈ పదవుల పంచాయతీని ఢిల్లీకి తీసుకెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రంగన్న తీరుపై ఫిర్యాదు చేశారు. రంగస్వామితో భేటీకి ప్రయత్నించి విఫలం కావడంతో ఇక మీరే తగిన చర్యలు చేపట్టాలని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పుదుచ్చేరిలో పదువుల వివాదాన్ని పరిష్కరించేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్ర రంగంలోకి దించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. నేడో, రేపో పుదుచ్చేరి సీఎం రంగస్వామితో భేటీ కానున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుకున్న పదవులను పొందాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ క్రమంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.