హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు తప్ప స్టార్ హీరోల సరసన అవకాశాలు అంతగా రాబట్టుకోలేకపోయినా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం మంచి ఆఫర్లే పడుతోంది. నాగార్జున రగడ, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ, రవితేజ శంభో శివ శంభో తప్ప ఈమె గ్రాఫ్ లో భారీ చిత్రాలు పెద్దగా లేవు. అయినా చేసిన సినిమాల కౌంట్ మాత్రం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వెంకటేష్ నారప్పలో మొదటిసారి అతని సరసన నటిస్తున్న ప్రియమణికి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ దక్కింది.వయసొచ్చిన కొడుకున్న హీరోకు భార్యగా చాలా డిఫరెంట్ గా అచ్చమైన పల్లెటూరి స్లాంగ్ తో ఈ క్యారెక్టర్ సాగుతుంది. ఇప్పుడు మరో మెగా ఆఫర్ తలుపు తట్టిందట.
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ముచ్చటపడి మరీ చేస్తున్న లూసిఫర్ రీమేక్ లో కీలకమైన సోదరి పాత్రకు ప్రియమణిని సంప్రదించినట్టు తాజా అప్ డేట్. గతంలో ఈ పాత్రకు రమ్యకృష్ణ, అనసూయ అని రెండో మూడు ఆప్షన్లు అనుకున్నారు కానీ అవేవి వర్కౌట్ అయ్యేలా లేవట. దర్శకుడు మోహన్ రాజా రంగంలోకి దిగాక మొత్తం క్యాస్టింగ్ ని మారుస్తున్నట్టు తెలిసింది. రీమేక్ స్పెషలిస్ట్ గా పేరున్న ఇతను ఈ విషయంలో చాలా నేర్పరి. అందుకే ఛాయస్ మొత్తం చిరు రాజాకే వదిలేసినట్టు తెలిసింది. ప్రియమణికి అనుకున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఓకే అయ్యిందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇది నిజమైతే ప్రియమణి మరో మంచి బ్రేక్ దొరికినట్టే. ఒరిజినల్ వెర్షన్లో ఈ పాత్ర మంజు వారియర్ చేసింది. కాకతాళీయంగా నారప్ప తమిళ సినిమా అసురన్ లో ఇప్పుడు ప్రియమణి చేస్తున్న క్యారెక్టర్ కూడా తనే చేసింది. ఇలా రెండు పాత్రలు తనకే దక్కడం విచిత్రమే. లూసిఫర్ తెలుగు టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. బైరెడ్డి అని ప్రచారంలో ఉంది. సంక్రాంతి సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టబోతున్నారు. ఆచార్య అవ్వగానే దీని రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి అతి తక్కువ టైంలో పూర్తి చేసేలా మోహన్ రాజా ప్లాన్ చేసుకున్నారు. సంగీతం ఎవరు అందిస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు.