స్వాత్రంత్య దినోత్సవం రోజున దేశ ప్రధాని ప్రసంగాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వం, శాంతి సౌరాభృత్వం, భవిష్యత్ దిశా నిర్దేశాలకనుగుణంగా ప్రసంగాలు సాగుతాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి చేసిన 74వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి మరో ప్రత్యేకత ఉంది. ఇది వరుసగా ఆయన ఏడవ ఇండిపెండెన్స్ డే ప్రసంగం కాగా, సుదీర్ఘ ప్రసంగాల్లో మూడవది. శనివారంనాడు 86 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. గత ఏడాది ప్రధాని ఎర్రకోట నుంచి 92 నిమిషాల పాటు ప్రసంగించారు. 2016లో ఆయన సుదీర్ఘ ప్రసంగం 94 నిమిషాల పాటు సాగింది. ఆయన తక్కువ సేపు చేసిన ప్రసంగం 2017లో చోటుచేసుకుంది. ఆ ఏడాది మోదీ 56 నిమిషాలు ప్రసంగించారు. 2014లో 65 నిమిషాలు, 2015లో 86 నిమిషాలు ఇండిపెండెన్స్ డే ప్రసంగం చేశారు.
మన్మోహన్ హయాంలో 10 సార్లు..
మోదీకి ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ తన హయాంలో 10 సార్లు ఎర్రకోట నుంచి ఇండిపెండెన్స్ డే ప్రసంగాలు చేశారు. కేవలం రెండు సందర్భాల్లో 2005, 2006లో చెరో 50 నిమిషాలు పాటు ప్రసంగించగా, తక్కిన ఎనిమిది సందర్భాల్లో ఆయన ప్రసంగాలు 32 నుంచి 45 నిమిషాలకు పరిమితమయ్యాయి. 1947లో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాల పాటు ఎర్రకోట నుంచి ఇండిపెండెన్స్ డే ప్రసంగం సాగించారు. 2015 వరకూ ఇదే అతి సుదీర్ఘ ప్రసంగంగా నిలిచింది.
మోదీ ప్రసంగంలో భారతీయత
భారతదేశ అభివృద్ధి.. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడంలో భారతీయుల కృషికి అనుగుణంగా మోదీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సాగింది. ”భారత్ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. ఒకనాడు భారత వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం. మన వస్తువులను మనమే గౌరవించకుంటే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం” అని ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు.
దేశం ముందడుగు
”స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతిబిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటోంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకువెళ్లాలి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. ఆత్మనిర్భర్ భారత్ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి” అని మోడీ పిలుపునిచ్చారు.