స్వీట్లను ఇష్టపడని వారు ఎవరుంటారు? ఈ మధ్యకాలంలో మధుమేహ వ్యాధి పీడితులు(డయాబెటిక్స్) తీపి పదార్థాలు తినడం తగ్గిస్తున్నా.. స్వీట్లకు ఉన్న డిమాండ్ పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడంలేదు. వందల రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నా వాటిలో కొన్ని రకాలు మాత్రమే తమదైన ప్రత్యేకత, విశిష్టత కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన కాకినాడ కాజా, మాడుగుల హల్వా ఈ కోవలోకే వస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రత్యేక తయారీ అయిన ఈ రెండు స్వీట్లు దాదాపు 130 ఏళ్ల నుంచి తమ ప్రత్యేకతను, డిమాండ్ ను కాపాడుకుంటూ వస్తున్నాయి. తాజాగా భారత తపాలా శాఖ ఈ రెండు స్వీట్లకు ప్రత్యేక కవర్లు విడుదల చేసి వాటి గౌరవాన్ని మరింత పెంచింది.
గొట్టం కాజాగా ప్రసిద్ధి
ప్రసిద్ధి పొందిన కాకినాడ కాజాను గొట్టం కాజాగా వ్యవహరిస్తుంటారు. 1891లో కాకినాడ ప్రాంతానికి చెందిన కోటయ్య అనే వ్యక్తి తొలిసారి ఈ కాజాను తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. పైకి కొంచెం గట్టిగా.. పొడి(డ్రై)గా కనిపించే కాజా లోపల డొల్లగా ఉండి రసంతో నిండి ఉంటుంది. కొరకగానే లోపలున్న తియ్యని రసం ఉబికి వస్తుంది. ఆ రసం కారిపోకుండా నేర్పుగా తింటూ దాని రుచిని ఆస్వాదించడం మంచి మజా ఇస్తుంది. 2018లో ఈ మిఠాయికి జియోగ్రాఫిక్ లొకేషన్ సౌకర్యం లభించడంతో అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం లభించింది. తాజాగా పోస్టల్ శాఖ దీని గౌరవం ఇనుమడించేలా ప్రత్యేక కవర్ విడుదల చేసింది.
చవులూరించే మాడుగుల హల్వా
విశాఖ జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన మిఠాయి మాడుగుల హల్వా. దీనిది కూడా 130 ఏళ్ల ప్రస్థానమే. జిల్లాలోని వడ్డాది మాడుగుల దీని జన్మస్థలం. ఆ గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు మొదటిసారి ఈ హల్వాను తయారు చేసి.. ప్రజలకు దాని రుచిని పరిచయం చేశారు. గోధుమ పాలు, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తగిన పాళ్లలో వేసి తయారుచేసే మాడుగుల హల్వా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. దీనికి లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉందని అంటారు. తరతరాలుగా దీని రుచి ఖండాంతరాల్లో పేరు ప్రతిష్టలు ఆర్జించి పెట్టింది. పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేయడం ద్వారా మాడుగుల హల్వాకు మరింత గుర్తింపు లభించేలా చేసింది.