ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గండికోట అభివృద్ధి చెందుతోంది. గ్రేట్ గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా భావించే గండికోటకు సంబంధించిన స్పెషల్ పోస్టల్ కవర్ ను పోస్టల్ శాఖ విడుదల చేసింది. జమ్మలమడుగు ఆర్డీఓ దానిని జమ్మలమడుగు తపాలా శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు మాత్రమే ప్రస్తుతం బాగా పరిచయం అయిన ఈ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఈ మేరకు స్పెషల్ పోస్టల్ కవర్ ను తీసుకొచ్చింది.
నిజానికి గండికోట వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వతశ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, గండి కొట్టినట్టుగా ప్రవహించే పెన్నా నది మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు300 అడుగులకు మించదు కానీ అమెరికాలో ఉన్న ఆరిజోనా గ్రాండ్ కెన్యాన్ ను పోలి ఉండే ఈ లోయ విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆ ఎర్రరాతి కొండమీద గండికోటను కూడా నిర్మించారు. 11వ శతాబ్దం నాటి చారిత్రక చరిత్ర కలిగిన గండికోటలో నాటి వైభవానికి ప్రతీకగా నిలిచిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.
చాళుక్య వంశానికి చెందిన చాళుక్య రాజు, కాకరాజు క్రీ.శ 1123లో గండికోటను నిర్మించారు. 300 సంవత్సరాలకు పైగా గండికోటను రాజధానిగా చేసుకుని పాలించిన పెమ్మసాని నాయకుల తర్వాత ఈ కోటను విజయనగర రాజులు పాలించారు. ఇక లోయతో పాటు కోట చారిత్రక వైభవాన్ని, కళాత్మక శిలా సంపద కూడ పర్యాటకులను కనువిందు చేస్తుంది. శత్రు దుర్భేధ్యమైన ఈ కోటకు మూడు వైపుల పెన్నానది లోయ, మరో వైపు ఎత్తైన కొండలు వ్యాపించి ఉన్నాయి..మామూలుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు పడటంతో స్థానికంగా ఉన్న వంకలు పొంగి పోర్లడంతో కొండపై నుంచి వాటర్ ఫాల్స్ పడుతుండటంతో పర్యాటకులు ఆ సమయంలో గండికోటను సందర్శిచడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న ప్రదేశాలను చూడలేదని బాధ పడకండి.. మన చుట్టుప్రక్కల ఉన్న ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను చూసి మరో నలుగురికి చూడమని చెప్పండి.